ఏఎంసీ ప్రిన్సిపల్ డా.సుధాకర్‌కి పుష్పగుచ్ఛం అందిస్తున్న నేవల్ ఆఫీసర్ ఇన్‌ఛార్జి కమెడోర్ సంజీవ్ ఇస్సార్
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్–19పై అలుపు లేకుండా ముందుండి పోరాడుతున్న యోధుల సేవలకు కృతజ్ఞతగా విశాఖలో నౌకాదళ హెలికాఫ్టర్ పూల వందనం సమర్పించింది. ఆస్పత్రుల్లో రాత్రిపగలు తేడా లేకుండా శ్రమిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందితోపాటు పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, మీడియా సేవలను అభినందిస్తూ వాయుసేన ఆదివారం పూలవర్షం కురిపించి గౌరవ వందనం చేసింది.
► విశాఖ ఐఎన్‌ఎస్ డేగాలో బయలుదేరిన నేవీ హెలికాప్టర్ ప్రభుత్వ టీబీ, ఛాతీ ఆస్పత్రి, గీతం ఆస్పత్రులపై పూలవర్షం కురిపించింది.
► ఆస్పత్రుల బయట కరోనా యోధులకు నేవల్ ఆఫీసర్ ఇన్‌ఛార్జి కమెడోర్ సంజీవ్ ఇస్సార్ పుష్పగుచ్ఛాలు అందించి సెల్యూట్ చేశారు. వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
► బంగాళాఖాతం సముద్ర జలాల్లో ఐఎన్‌ఎస్ జలశ్వ యుద్ధ నౌకపై సెయిలర్లు ‘థాంక్యూ’ అంటూ ఇంగ్లిష్ అక్షరాకృతిలో నిలుచుని కోవిడ్ యోధులకు గౌరవ వందనం సమర్పించారు.
► ఐఎన్‌ఎస్ సావిత్రి యుద్ధనౌకలో సెయిలర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ విన్యాసాలు నిర్వహించారు.
► రాత్రి 7.30 గంటలకు విశాఖ ఆర్‌కే బీచ్‌లో రెండు యుద్ధనౌకల్లో విద్యుత్ దీపాలు వెలిగించి కరోనాపై పోరాటం సాగిస్తున్న వారందరికీ వందనం సమర్పించారు. పచ్చరంగు కాంతి వెదజల్లే బాణసంచా కాల్చి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నాం..
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కరోనా మహమ్మారికి అడ్డుకట్టే వేసేందుకు పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నాం. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బందికి అందరి సహకారంతో పాటు ప్రశంసలు లభించడం ఆనందంగా ఉంది.
– బి.వెంకటరమణ, ఛాతీ ఆసుపత్రి ఇన్‌చార్జి
మా బాధ్యత పెరిగింది
నౌకాదళం స్ఫూర్తితో మా బాధ్యత మరింత పెరిగింది. విశాఖలో వ్యాధి వ్యాప్తిని చాలావరకు నియంత్రించాం. వెయ్యి మందికిపైగా పారా మెడికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. పోలీసులు, పారిశుధ్య కార్మికుల సహకారంతో కరోనా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధ్దంగా ఉన్నాం’
– డాక్టర్ పీవీ సుధాకర్, ప్రిన్సిపల్ ఏఎంసీ
Comments
Please login to add a commentAdd a comment