హైదరాబాద్ : ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించటంతో ఓ స్టాప్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నేరేడ్మెట్ సీఐ కొత్వాల్ రమేష్ వివరాల ప్రకారం...బలరాం నగర్లో నివాసం ఉండే రవీందర్ సింగ్ (30) హైటెక్ సిటీలోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో ప్రాసెస్ మేనేజర్గా పని చేస్తున్నాడు. కొన్నిరోజులుగా రవీందర్ సింగ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ వివాహానికి ఇరుకుటుంబాలు నిరాకరించాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే అంతకుముందు రవీందర్ సింగ్ 'ప్రియతమా..నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని' ప్రేమిస్తున్న అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన ఆమె రవీందర్ సింగ్ సోదరుడు మహేందర్ సింగ్కి సమాచారం ఇవ్వగా...అతను వచ్చేసరికే తమ్ముడు ఉరి వేసుకుని కనిపించాడు. మహేందర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.