కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కాసులు తప్ప వారికి మహిళల ఆరోగ్యం పట్టినట్టు లేదు. డబ్బులు ఎలా రాబట్టుకోవాలన్న ఆలోచన తప్ప.. మరేదీ ఉన్నట్టు లేదు. అంతా బాగానే ఉన్నా... ప్రాణాలకు ప్రమాదమని చెప్పి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. మంచినీళ్లు తాగినట్టుగా.. సాధారణ కాన్పులకు కూడా ఆపరేషన్లు చేస్తూ ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు వైద్యులు ప్రసవాల కోసం వచ్చిన వారికి అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తూ దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉన్నా గర్భిణులను భయాందోళనలకు గురిచేస్తూ ఆపరేషన్లకు అంగీకరించేలా చేస్తున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు నిర్మోహమాటంగా ఆపరేషన్లు చేస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. ఒక్కో ఆపరేషన్‌కు సుమారు. రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రసవాల కోసం జరుగుతున్న ఆపరేషన్లలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా సుమారు 250 నర్సింగ్‌హోంలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. రాష్ర్ట ప్రభుత్వం అన్ని ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుఖ ప్రసవాల కోసం అన్ని సౌకర్యాలను సమకూర్చడంతో పాటు శిక్షణ పొందిన వైద్యులు, సిబ్బందిని నియమించింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి జననీ శిశు సురక్ష పథకం కింద ఉచితంగా పరీక్షలను నిర్వహించడంతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేస్తారు. 108 సేవలను కూడా పొందవచ్చు. ఇన్ని సౌకర్యాలు కల్పించినా ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వందల సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పులు జరుగుతుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేల సంఖ్యలో ప్రతి నెలా కాన్పులు జరుగుతున్నాయి. ప్రైవేటు ప్రాక్టీస్‌కు మొగ్గుచూపుతున్న వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
దీంతో విధిలేని పరిస్థితుల్లో గర్భిణులు కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించి సుఖప్రసవం అయ్యే అవకాశం ఉన్నా ఆపరేషన్లు చేస్తూ దోపిడీ చేస్తుండంతో పాటు వారిని అనారోగ్యాల పాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పది శాతం ఆపరేషన్లు జరుగుతుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో పది శాతమే సుఖప్రసవాలు జరుగుతున్నట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. అంటే ప్రైవేటు ఆస్పత్రులకు వెల్లే వారిలో 90 శాతం మందికి సిజేరియన్‌లు తప్పడం లేదు.
కాసుల‘కోత’
Published Thu, Jan 23 2014 3:44 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement