రక్షణ కల్పించాలని కోరుతున్న ఉన్నమట్ల లక్ష్మణదాసు
సాక్షి, యలమంచిలి: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉన్నమట్ల లక్ష్మణదాసు. పశ్చిమగోదావరి జిల్లా కొంతేరు పంచాయతీ లేతమామిడితోటకు చెందిన లక్ష్మణదాసు భార్య చనిపోయింది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను పెళ్లి చేసుకోలేదు. చిన్న కుమారుడు చిరంజీవికి, కూతురు సౌమ్యలకు పెళ్లి అయ్యింది. లక్ష్మణదాసుకు ప్రభుత్వం ఇచ్చిన ఐదు సెంట్ల ఇంటి స్థలం ఉంది. అది కాకుండా మరో ఐదు సెంట్ల స్థలం ఉంది. ఈ మధ్య చిన్న కుమారుడు చిరంజీవి, అతని భార్య రజని ఆస్తి తమ పేరిట రాయమని ఇబ్బంది పెడుతున్నారు. అతని స్థలంలో ఉన్న కొబ్బరి చెట్ల ఫలసాయం కూడా తీసుకోకుండా అడ్డుకుంటున్నారు.
అంతేకాకుండా కుక్కను తీసుకువచ్చి లక్ష్మణదాసుపై ఉసిగొల్పుతూ భయపెడుతున్నారు. దీనిపై స్థానిక సంఘ పెద్దలకు చెపితే వారి మాట కూడా వినకుండా సంఘ పెద్దలను దుర్భాషలాడి చెదరగొట్టారు. దీంతో స్థానిక సర్పంచ్ కలుగజేసుకుని ఆస్తి రాయమని సలహా ఇచ్చారు. సరే కదాని ఇరువురు కుమారులకు చెరొక 5 సెంట్ల స్థలం ఇవ్వడానికి సిద్ధపడగా అలా కుదరదు నాకు ఏడున్నర సెంట్లు రాయాలని చిన్న కొడుకు, కోడలు ఎదురుతిరగడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంటిలో ఉంటుంటే సూటి పోటు మాటలతో ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో తన కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని లక్ష్మణదాసు తహసీల్దార్ వి. స్వామినాయుడిని కలసి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment