చిలకలూరిపేట : కన్నకొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. ఆస్తి దక్కదన్న అక్కసుతో కిరాయి వ్యక్తుల్ని వెంట తీసుకువచ్చి పథకం ప్రకారం నట్టింట్లో గొంతునులిమి హత్యచేశాడు. ఇంట్లోని డాక్యుమెంట్లు, నగదు ఉన్న సంచితో హంతకుడు, అతని అనుచరులు పరారయ్యారు. ఈ హత్య మండలంలోని కుక్కపల్లి వారిపాలెంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన కొండ్రుగుంట నాగయ్య (76), కమలమ్మకు ముగ్గురు సంతానం.
పెద్దకుమారుడు శివశంకర్, రెండో కుమారుడు హరిబాబు, కుమార్తె ధనమ్మ ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. హరిబాబు (45)కు 15ఏళ్ల క్రితమే వివాహం కాగా ఆరునెలలు తిరక్కముందే భార్య తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయింది. వ్యసనాలకు బానిసైన హరిబాబు ఆ తర్వాత ఐదేళ్లకు మళ్లీ పెళ్లి చేసుకోగా ఆమెకూడా ఎనిమిదేళ్ల క్రితం ఇల్లు విడిచింది. ఈమెకు పుట్టిన బిడ్డ మహేష్ ప్రస్తుతం నానమ్మల వద్దే ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
కాగా, నాగయ్యకు పాతిక ఎకరాల ఆస్తి ఉంది. తన ముగ్గురు బిడ్డలకు సమానంగా పొలం ఇవ్వాలని భావించాడు. హరిబాబు వ్యవసానాలకు బానిస కావడంతో కొడుకు వాటాలోని సగ భాగాన్ని మనవడైన మహేష్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తండ్రి నిర్ణయాన్ని హరిబాబు ఒప్పుకోలేదు. దీంతో తండ్రి కొడుకుల మధ్య పదిరోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో అనుచరులతో కలసి హరిబాబు ఇంట్లోకి వచ్చి గొడవ విషయమై తండ్రి కోసం పోలీసులు వచ్చారని తల్లితో చెప్పాడు.
ఈలోగా ఇంటి పక్కనే ఉన్న పాకలో పడుకున్న నాగయ్య విని వరండాలోకి వచ్చాడు. హరిబాబు కండువాను తండ్రి మెడకు వెనుక నుంచి ఉచ్చులా వేశాడు. వెంటనే ఆలా శ్రీను రెండు చేతుల్ని వెనక్కులాగి ఉచ్చు బిగించి, తలపై బలంగా కొటాడు. నాగయ్య తలనుంచి, చెవుల నుంచి రక్తం చూసిన హరిబాబు కొడుకు మహేష్ తాతయ్యను చంపుతున్నారంటూ కేకలు వేస్తూ బయటకు పరుగు పెట్టాడు. అడ్డువెళ్లిన కనకమ్మనూ కొట్టారు. క్షణాల్లో నాగయ్య ప్రాణం కోల్పోవడంతో ఆయన చొక్కా విప్పి, దేహంపై ఉన్న నెత్తురు తుడిచి, వరండాలోని రక్తాన్ని నీళ్లతో శుభ్రం చేశారు.
తండ్రి శవాన్ని శుభ్రం చేసి ఇంటి పక్క పాకలో మంచంపై పడుకో బెట్టి దుప్పటి కప్పి పరారయ్యారు. అనంతరం ఇంట్లోంచి తీసుకువెళ్లిన సంచిలోని 13 సవర్ల బంగారు గొలుసు, రెండు ఉంగరాలు తీసుకుని, డాక్యుమెంట్లు ఉన్న సంచిని గ్రామంలోని చెరువులో పడేశారు. మంగళవారం కుటుంబసభ్యులు చూసి బయటకు తీశారు. అందులో కొంత నగదు ఉంది. చెరువులో లభ్యమైన నగదు, డాక్యుమెంట్లను ఇంటి వద్ద ఆరబెట్టారు. కాగా, సోమవారం నాగయ్య కూతురు ధనమ్మ నగలను బ్యాంకు నుంచి విడిపించగా మిగిలిన డబ్బు సంచిలో ఉంచినట్లు తెలిపారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య
పది రోజుల క్రితం పెద్దకోడలు హైదరాబాద్‌లో ఉంటున్న కూతురు వద్దకు వెళ్లింది. ఆమెభర్త శివశంకర్ అత్తగారి ఊరైన పరిటాల వారిపాలెం వెళ్లాడు. ఇదే అదునుగా మహేష్ భావించి ఈ అఘాయిత్యానికి వడిగట్టాడు. రూరల్ సీఐ దిలీప్‌కుమార్, రూరల్ ఎస్‌ఐ జగదీష్ బాధితుల నుంచి వివరాలు సేకరించారు.
కన్న కొడుకే.. కాలయముడు!
Published Wed, May 13 2015 3:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:41 PM
Advertisement
Advertisement