
తల్లిని హతమార్చిన కొడుకు
వేముల(వైఎస్సార్ జిల్లా): కన్న కుమారుడే తల్లిని హత మార్చిన ఘటన వైఎస్సార్ జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బయమ్మ కుమారుడు రవిశంకర్‌రెడ్డి తాగుడుకు బానిసై ప్రతిరోజు డబ్బులకోసం తల్లిని వేధించేవాడు. బుధవారం తెల్లవారుజామున డబ్బులు ఇవ్వాలని తల్లిని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవిశంకర్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యాడు. కొడవలితో తల్లి మెడపై నరికడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటనకు సంబంధించి సమీప బంధువు గంగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేముల ఎస్సై నరేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.