అంపశయ్యపై నాన్న! | Son Reacts on His Father Allegations in Hindupur Anantapur | Sakshi
Sakshi News home page

అంపశయ్యపై నాన్న!

Published Fri, Jan 3 2020 10:17 AM | Last Updated on Fri, Jan 3 2020 11:02 AM

Son Reacts on His Father Allegations in Hindupur Anantapur - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివశంకరయ్య ,కుమారుడు నాగేంద్ర

నేను పోతేనే ఇంట్లో అన్నం: మా పరిస్థితి దయనీయంగా ఉంది. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచి పెద్దచేసింది. నేను ఊరికి పోతేనే ఇంట్లో అన్నం వండుకుంటుంది. లేదంటే కూలి పనులకు వెళ్లిన చోట ఎవరైనా ఏదైనా పెడితే తింటుంది. లేకపోతే పస్తులుంటుంది. ఇంతకాలం మా బాగోగులు పట్టించుకోని నాన్న ఉన్నా లేనట్లే అనుకున్నాం. ఒక్క రోజు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎక్కడున్నాడో, ఏమయ్యాడో కూడా తెలియలేదు. 12 ఏళ్ల తర్వాత ఆయన దీనావస్థ నాకు కన్నీళ్లు పెట్టిస్తోంది. – ‘సాక్షి’తో కన్నీటి పర్యంతమైన శివశంకరయ్య కుమారుడు నాగేంద్ర  

నాన్న.. ఓ నమ్మకంతల్లి నవమాసాలుమోస్తే.. తండ్రి జీవితాన్నిస్తాడు.. చేయిపట్టి నడిపిస్తాడు..తడబడే అడుగులనుసరిచేస్తాడు..తను కరిగిపోతూ..ప్రతిరూపానికి దారి చూపుతాడు.పిల్లల కంట్లో నలుసుపడినా..ఆ తండ్రి కంట్లో సుడులు,కష్టాల్లో సుఖాల్లో..తోడూనీడ.. ఆ బంధం.ఇంట్లో దీపం పెట్టిన ఇల్లాలికిఅన్నీ తానవుతూ..ఇంట్లో వెలుగులు నింపినపిల్లలకు సర్వస్వం ధారపోసేప్రత్యక్ష దైవం తండ్రి.
– ఇదీ సమాజంలో నాన్నకు నిర్వచనం

ఏడడుగుల బంధం..  ఎన్నో ఆశలతో  మెట్టినింట్లో అడుగు పెట్టిన ఇల్లాలు.భర్త చాటు భార్యగానలుగురికీ తలలో నాలుకగా..ఓ పిల్లాడికి తల్లిగా..ఈ సంతోషంఎంతో కాలం నిలువలేదు..ఎగ‘తాళి’చేసి భార్య చేయి వదిలాడు..బాధ్యత మరిచి తిరిగాడు..ఏళ్ల తరబడి ఇల్లు కాదనుకున్నాడు..జీవిత చరమాంకంలో,నా అనే పిలుపునకు నోచుకోక..అనాథలా బతుకీడుస్తున్నాడు.మృత్యువు ముంగిట  రోజులు లెక్కిస్తున్నాడు.
– దారి తప్పిన తండ్రి దీనావస్థ ఇది

అనంతపురం, హిందూపురం: బలిజ శివశంకరయ్య.. వయస్సు 80 ఏళ్లు. సొంతూరు రాయచోటి సమీపంలోని మాసాపేట. లారీ డ్రైవర్‌గా పనిచేసే ఇతనికి సుమారు 35 ఏళ్ల క్రితం వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం చిట్లూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు  సంతానం. కుమార్తె, కుమారుడు. ఇంతవరకు  సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత అతను బాధ్యత మరిచిపోయాడు. మాసాపేటలో ఉండలేక భార్య ఊరికి మకాం మార్చాడు. అక్కడా ఇమడలేకపోయాడు. కుటుంబాన్ని గాలికొదిలేశాడు. తన జీవితం, తన ఇష్టమనుకున్నాడు. దొరికిన చోటల్లా అప్పులు చేసి ముఖం చాటేశాడు. అప్పటి నుంచి ఆ ఇంటి నిండా కష్టాలే. తినేందుకు తిండి లేక.. పిల్లల బాగోగులు చూసే స్థోమత కరువై ఆ ఇల్లాలు పడిన వేదన అంతాఇంతా కాదు. భర్త చాటు భార్యగా మెలిగిన ఆమెకు జీవితం శూన్యంగా కనిపించింది. ఓ వైపు ఎదిగి వస్తున్న పిల్లలు.. మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేదు. కళ్ల నుంచి ఉబికి వచ్చే నీళ్లతో తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఇంటి నుంచి కాలు బయటపెట్టి బతకడం నేర్చుకుంది.

కూలి పనులతో జీవనం
భర్త వస్తాడు.. కుటుంబాన్ని చక్కదిద్దుతాడని నిరీక్షించింది. రోజులు.. నెలలు గడిచిపోయాయి. ఇక లాభం లేదనుకొని ఊళ్లోనే కూలి పనులకు వెళ్లింది. పొలం పనులకు వెళ్లిన సమయంలో తోటి కూలీలు పెట్టిన ముద్ద తిని కడుపు నింపుకుంది. పైసా పైసా కూడబెట్టి పిల్లలను ప్రయోజకులను చేసేందుకు ఎంతో శ్రమించింది. కుమార్తెకు వివాహం చేసింది. కుమారుడు ఎంటెక్‌ పూర్తి చేసేందుకు ఆమె పడిన కష్టం ఆ ఊరంతటినీ కంటతడిపెట్టిస్తుంది.

చదవండి: నాకు నాన్న అవసరం లేదు...
చికిత్స కోసం కుమారుని వద్దకు..
వయస్సులో ఉండగా శివశంకరయ్యకు భార్య, పిల్లలు గుర్తుకు రాలేదు. సుమారు పదేళ్లు గడిచాక, కాలుకు పుండు కావడంతో చికిత్స కోసం డబ్బు అవసరమై కుటుంబ సమాచారాన్ని సేకరించాడు. కుమారుడు హైదరాబాద్‌లో బ్యాంకు కోచింగ్‌ తీసుకుంటున్న విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తండ్రిని చూసి ఆ కుమారుడు చలించిపోయాడు. గతాన్ని పక్కనపెట్టి స్నేహితుల వద్ద తలకు మించిన అప్పులు చేసి తండ్రి కాలికి చికిత్స చేయించాడు. తన అద్దెకు ఉంటున్న రూములోనే తండ్రికి ఓ మంచం ఏర్పాటు చేసి తన లక్ష్యాన్ని పక్కనపెట్టి సపర్యలు చేశాడు. ఆరోగ్యం కాస్తకుదుటపడగానే చెప్పాపెట్టకుండా శివశంకరయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

హిందూపురంలో ప్రత్యక్షం
ఎక్కడున్నాడో తెలియదు.. ఏం చేశాడో తెలియదు.. మూడు రోజుల క్రితం హిందూపురం ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ స్వచ్ఛంద సంస్థకు తారసపడ్డాడు. కుడి కాలుకు ఏర్పడిన గాయం పెద్దదై పురుగులు పట్టిన స్థితిలో ఉన్న శివశంకరయ్యను ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులుగా ముస్లిం నగారా ట్రస్టు వ్యవస్థాపకుడు ఉమర్‌ఫరూఖ్, సభ్యులు అన్నీ తామై సపర్యలు చేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరట, బయటకు నెట్టేశారట!
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ ఆ తండ్రి కుటుంబ పరువును బజారుకీడ్చాడు. తన కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని, తన డబ్బునంతా లాక్కొని భార్య, పిల్లలు బయటకు నెట్టేశారని నిందలు మోపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కుమారునికి ఫోన్‌ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా బెదిరిపోయిన ఆ యువకుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. మీ ఇష్టం సార్, మేము ఆయన వల్ల చాలా కోల్పోయాం, ఇక ఆయనను భరించలేమని కన్నీటి పర్యంతమయ్యాడు.

ఎంతైనా నాన్న..  
జన్మనిచ్చిన తండ్రి తనను గాలికొదిలేసినా.. ఆ యువకుడు బాధ్యతగా భావించాడు. ఇన్నేళ్లు రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిని కనీసం జీవిత చరమాంకంలోనైనా సుఖపెట్టాలనే ఆశ ఒకవైపు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయం మరోవైపు. ఇప్పటికీ జీవితంలో కుదురుకోలేదు. ఎంటెక్‌ పూర్తి చేసి నాలుగేళ్లయినా ఉద్యోగం లేదు. ఈ పరిస్థితుల్లో హిందూపురానికి వచ్చి తండ్రిని కాపాడుకునేందుకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.   

పరిస్థితి ఆందోళనకరం
ప్రస్తుతం శివశంకరయ్య కాలు కుళ్లిపోయింది. ఇది హైరిస్కు కేసు. షుగర్‌ కూడా ఉంది. కాలును మోకాలు వరకు తొలగించాలి. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వారి అంగీకారం మేరకు ఆపరేషన్‌ నిర్వహిస్తాం. వాళ్లు ఎవరూ స్పందించకపోతే రెండు రోజుల్లో మానవతా దృక్పథంతో మేమే ఆపరేషన్‌ చేస్తాం.  – డాక్టర్‌ కేశవులు,ఆసుపత్రి సూపరింటెండెంట్‌ 
చదవండి: నాకు నాన్న అవసరం లేదు...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement