ప్రొద్దుటూరు నైట్ షెల్టర్‌లో వృద్ధులు
మాయమైపోతున్నాడమ్మా..మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్న వాడు.. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు.. యాడ వున్నడో గానీ కంటికి కనరాడు.. నిలువెత్తు స్వార్థం నీడలా గొలుస్తుంటే.. చెడిపోక ఏమైతదమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ.. సంబంధాలు దిగజారుతున్నాడోయమ్మా.. అని ఓ సినీ కవి పాట రాశారు.. ఇదీ ప్రస్తుత సమాజం తీరుకు అద్దం పడుతోంది.
ప్రొద్దుటూరు టౌన్ : తల్లిదండ్రులు.. కనిపించే దేవుళ్లు అంటారు. ఎందుకంటే జన్మనిచ్చి, పెద్దయ్యే వరకు అన్నీ సమకూర్చేది వారే. పిల్లలకు రెక్కలొచ్చాక తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని, వారికి జీవితాన్ని ఇచ్చిన తండ్రిని అనాథలుగా మారుస్తున్నారు. కుమారులు పట్టించుకోక, కోడళ్ల ఛీత్కారాలు తట్టుకొలేక, మనసు చంపుకుని వారి వద్ద ఉండలేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. అన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఆదరణ కరువైన వృద్ధులు దయనీయ పరిస్థితిలో మగ్గుతున్నారు. ‘నాడు గోరుముద్దలు తినమంటే ఏడిపించారు.. నేడు ఇంత ముద్ద పెట్టకుండా ఏడిపిస్తున్నారు’ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నైట్ షెల్టరే దిక్కైన వైనం: దాదాపు 30 మంది ఇంట్లో నుంచి వచ్చి ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాలవీధిలో ఉన్న నైట్ షెల్టర్‌లో ఉంటున్నారు. ఏ ఆదరణ లేని వారు ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నారు. వీరికి నైట్ షెల్టర్‌లో రాత్రిపూట భోజనం, బస ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం వేళ రామేశ్వరంలో ఉన్న అన్నపూర్ణ అన్నదానం సత్రం వారు భోజనం అందిస్తున్నారు.
ముగ్గురు కుమారులున్నా..
నా పేరు సి.లక్ష్మీదేవి. నా భర్త మునెయ్య చనిపోయినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురు మగ పిల్లలు. వారిని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. నన్ను ఒక్కరూ చేరదీయలేదు. వారు కొంత మేరకు స్థిరపడ్డారు. అయినా కనీసం నేను ఎలా ఉన్నాను అని పరామర్శించడం లేదు. ఇళ్లలో పని చేసి, ఎవరైనా అన్నం పెడితే తిని బతికీడుస్తున్నా. కొన్ని నెలల క్రితం పక్షవాతం వచ్చింది. అయినా ఏ కొడుకు పట్టించుకోలేదు. ఎంత బాధ పడ్డానో చెప్పలేను. ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నాను. నెలకు రూ.1000 పైగా మందులకు ఖర్చవుతోంది. షుగర్ ఎక్కువగా ఉండటంతో ఆకలికి తట్టుకోలేక పోతున్నాను. చాలా సార్లు పింఛన్ కోసం దరఖాస్తు చేసినా రాలేదు. చివరకు కలెక్టర్ వద్దకు వెళ్లినా ఫలితం లేదు.
ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు
నాపేరు పామిడి అచ్చమ్మ. 80 ఏళ్లు దాటాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని వరలక్ష్మి ఆస్పత్రి వీధిలో నివాసం ఉంటున్నాను. భర్త పెద్ద సుబ్బ రాయుడు మరణించాక కొడుకు మద్యానికి బానిసయ్యాడు. ఇళ్లలో పని చేసుకుని బతుకుతున్నాను. నేను ఉన్నానో, పోయానో అని కూడా కొడుకు ఆరా తీసే పరిస్థితిలో లేడు. వచ్చే రూ.1000 పింఛన్‌తో కాలం వెల్లదీస్తున్నాను. ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితులు రాకూడదు. ఎంతో కష్టపడి పిల్లలను పెద్ద చేస్తే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోక పోవడం దారుణం.
మనవడు, మనవరాలినిచూడాలని ఉంది
నా పేరు మాదాల సుబ్రహ్మణ్యం. వయసు 70 ఏళ్లు. భార్య, కూతురు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశాను. మా దాయాదులు, బంధువులు కోటీశ్వరులు. అల్లుడు, నేను కలిసి ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో బ్యాగుల దుకాణాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమయంలో నా వాటాగా రూ.10 లక్షల 52 వేలు పెట్టుబడి పెట్టాను. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. అల్లుడు తర్వాత నాకు ఏమీ ఇవ్వలేదు. క్రమేణ ఆరోగ్య దెబ్బతినింది. ఊపిరితిత్తులు దెబ్బతిని ఆస్మా వచ్చింది. రెండేళ్ల క్రితం ఉన్నట్టుండి భార్య, కూతురు, అల్లుడు ప్రొద్దుటూరు విడిచి తిరుపతికి వెళ్లారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను. కుటుంబ సభ్యుల ఫొటో చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాను. వారు ఎక్కడికి వెళ్లారో తెలియక బంధువులు, స్నేహితుల వద్దకు వెళితే.. వారు ప్రవర్తించే విధానం చూసి తట్టుకోలేకపోయాను. రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. తిరుపతిలో కూతురు ఇల్లు కనుక్కొని వెళితే వారు ఇంటిలోకి రానించుకోలేదు. మీరు తినేదాంట్లో ఒక ముద్ద పెట్టమని అడిగినా.. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని భార్యతో సహా అందరూ చెప్పడంతో తిరిగి ప్రొద్దుటూరు వచ్చాను. నాకు మనువడు, మనువరాలు అంటే చచ్చేంత ప్రాణం. వారి వద్దకు వెళ్లేందుకు సాయం చేయాలని కనిపించిన వారినందరిని వేడుకుంటున్నా.
Comments
Please login to add a commentAdd a comment