ఎస్పీని కలిసేందుకు వచ్చిన వృద్ధులు (ఫైల్)
గుంటూరు(పట్నంబజారు): నిండు నూరేళ్ళు.. చల్లగా ఉండాలన్న పేగు బంధానికి వెలకడుతున్నారు.. నవమాసాలు మోసిన అమ్మకు నాలుగు మెతులకు పెట్టులేకపోతున్నారు.. నీ బాగోగులపై.. మాకు భాధ్యత లేదంటున్నారు... బ్రతుకు నడక నేర్పిన తల్లితండ్రులను భారమంటున్నారు... కన్నపేగుపై కాఠిన్యంగా.. వ్యవహరిస్తున్నారు.. కష్టపడి పెంచిన నాన్నను నడిరోడ్డు పాలుచేస్తున్నారు.. ఆస్ధి కోసం ఎంతటి వేధింపులకు వెనుకాడటంలేదు.. సభ్య సమాజం తలదించుకునేలా.. జన్మనిచ్చిన వారు.. బతుకు జీవుడా.. అంటున్నా... కనికరం చూపటం లేదు. అందుకే వృధ్ధాశ్రమాలు.. అనాధ శరణాలయాలు.. కిక్కిరిసి దర్శనమిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌లో ఉండే ఆదాం షఫీ 146 గజాల్లో రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. భార్య హసన్‌బీకి పక్షవాతం రావటంతో పండుటాకుల పరిస్థితి దయనీయమంగా మారింది. ఇద్దరు కుమారులు ఉంటే.. వారిలో చిన్న కుమారుడు, కోడలు వేధించడంతో పోలీసులను ఆశ్రయించారు. అమృతలూరులో ఉండే సూర్యకుమారికి ఇద్దరు సంతానం, ఉన్న ఆస్తులను సమానంగా పంచారు. సుమారు రూ.50 లక్షల విలువ చేసే ఆస్తులు ఇచ్చానని, పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత పెద్ద కోడలు, చిన్న కుమారుడు, పెద్ద కోడలు పట్టించుకోవటం లేదని కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి వారు అధైర్యపడాల్సిన పని లేదని చట్టాలతో రక్షణ పొందవచ్చని న్యాయస్థానాలు చెబుతున్నాయి.
వృద్ధాశ్రమాల బాట
జిల్లాలో వృద్ధాశ్రమాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 2016లో 76, 2017లో 117, ప్రస్తుతం 140 వరకు ఆశ్రమాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కేవలం ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో బిడ్డలు తమను పట్టించుకోవడం లేదంటూ 162 కేసులు నమోదయ్యాయి. అధికారంగా ఉన్న వృధ్ధాశ్రమాలతోపాటు కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వృద్ధులను ఆశ్రయం కల్పిస్తున్నాయి.
పండుటాకుల రక్షణగా చట్టాలు
♦ తల్లితండ్రులను ఇబ్బందులు గురి చేసినా..వేధించినా తల్లిదండ్రులు సెక్షన్ 125 సీఆర్‌పీసీ ప్రకారం కోర్టులో దావా వేయవచ్చు. వీటికి సంబంధించి పూర్తి న్యాయ సలహాలు అందించేందుకు న్యాయస్థానాలు అవకాశం కల్పిస్తున్నాయి.
♦ పోలీసు సహాయంతో సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ యాక్ట్, సెక్షన్ – 4 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
♦ 2007లో కేంద్ర ప్రభుత్వం తల్లితండ్రులు, వృద్ధు సంరక్షణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం పండుటాకులకు బాసటగా నిలుస్తోంది.
2011లో మన రాష్ట్రంలో వృద్ధుల సంక్షేమం కోసం ఏపీ సీనియర్ సిటిజన్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీని ద్వారా పోషించుకోలేని పరిస్థితుల్లో, సంపాదించుకోలేని స్థితిలో ఉన్న వారికి ఈ చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు
ఫిర్యాదు చేసే విధానం..
తల్లిదండ్రులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయటమే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అధికారులను కలవొచ్చు. బిడ్డల అన్యాయాన్ని నేరుగా ట్రిబ్యునల్ (ఆర్డీవో స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుడు నివసించే స్థలం, గతంలో ఉన్న ప్రాంతం, పిల్లలు, బంధువులు నివసించే ప్రదేశాల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కావాలనే ఉద్దేశపూర్వంగా తల్లితండ్రులను వేధిస్తే...సెక్షన్ 25 ప్రకారం మూడు నెలల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా వి«ధించే అవకాశాలు ఉన్నాయి. పోషిస్తామని చెప్పి ఆస్తులు రాయించుకున్న తరువాత వారిని విస్మరిస్తే.. ఆ పత్రాలు, దస్తావేజులు అప్పటికప్పుడు రద్దవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment