అమ్మకు అవమానం
- కన్నకొడుకులే కర్కశులుగా మారిన వైనం
- పోషణకు వాటాలు వేసుకున్న కఠినాత్ములు
- చనిపోయినా అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు
పార్వతీపురం(విజయనగరం జిల్లా): 'నపుత్రస్య గతిర్నాస్తి' అన్నది ఆర్యోక్తి. తలకొరివి పెట్టేందుకు కొడుకులు కావాలన్నది దాని అంతరార్థం. కానీ, తల్లి రుణం తీర్చుకోవడానికి వంతులు వేసుకున్నారు ఈ కుమారులు. అంతేకాదు... ఆమె మరణిస్తే కనీసం అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రాకుండా అనాథలా శవాన్ని శ్మశాన వాటికలో వదిలేసిన సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటు చేసుకుంది.
పార్వతీపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి స్వర్గీయ వారణాసి బాలకృష్ణ మరణానంతరం అతని భార్య వారణాసి కమలమ్మ(70)ను, ఆమె ముగ్గురు కొడుకులు వారణాసి మోహనరావు(మందులషాపు నడుపుతున్నారు), వారణాసి శ్రీహరి(ఏజన్సీలు నడుపుతున్నారు), వారణాసి శ్రీనివాసరావు(విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు) తలో నాలుగు నెలలు పోషించేందుకు వాటాలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని మూడో కొడుకు వద్ద ఉన్న కమలమ్మను నాలుగు నెలలు పూర్తికావడంతో శనివారం కారులో పార్వతీపురంలో ఉన్న మరో కొడుకు వద్దకు తీసుకువస్తున్నారు. కారు బొబ్బిలి సమీపానికి చేరుకోగానే ఆమె మృతి చెందింది. వైజాగ్ నుండి తీసుకువస్తున్న కొడుకు చనిపోయిన తన తల్లి మృతదేహాన్ని విశాఖపట్టణానికి తీసుకువెళ్లలేక, పార్వతీపురం, మక్కువలో ఉన్న తన సోదరుల ఇళ్లకు తీసుకెళ్లేందుకు యత్నించగా వారు నిరాకరించారు.
దీంతో చేసేది లేక పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం వరకు ఉంచి చివరకు రాయగడ రోడ్డులోని శ్మశాన వాటికకు చేర్చాడు. అక్కడ అంత్యక్రియలు పూర్తచేసేందుకు కూడా మిగిలిన ఇద్దరు కుమారులు రాలేదు. విషయం తెలుసుకున్న కమలమ్మ బంధువులు శ్మశాన వాటికకు చేరుకున్నారు. కుమారులు అనుసరిస్తున వైఖరిపై పట్టణ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ బెలగాం జయప్రకాష్‌నారాయణ, గుంట్రెడ్డి రవి, వారణాశి విస్సు, పట్నాన కిరణ్ తదితరులు శ్మశాన వాటికకు చేరుకొని ఆ ముగ్గురు కొడుకులకు చీవాట్లు పెట్టి ఆ మాతృమూర్తికి దహన సంస్కారాలు జరిగేలా చూశారు.