జిల్లా ఎస్పీ తమ గ్రామాన్ని దత్తత తీసుకొన్నాడని తెలియగానే జనం సంబరాలు చేసుకొన్నారు. ఇక కష్టాలు తీరినట్లేనని, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని గ్రామస్తులు కలలు కన్నారు. వారి కలలు కలగానే మిగిలిపోయి.. ఆశలు అడియాశలయ్యాయి. కేవలం వాటర్ ప్లాంట్ ఏర్పాటుతోనే అభివృద్ధి ఆగిపోయింది. ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువత నిరాశలో కొట్టుమిట్టాడుతోంది. కమ్యూనిటీహాల్ శంకుస్థాపనలకే పరిమితమైంది. గుర్రంకొండ మండలం సంగసముద్రం గ్రామాన్ని రెండేళ్ల కిందట అప్పటి ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ దత్తత తీసుకుని అభివృద్ధికి ఇచ్చిన హామీలు నీరుగారాయి. తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తానన్న వాగ్దానం ఒట్టిమాటగా తేలిపోయింది. తీరుమారని సంగసముద్రంవాసుల కష్టాలపై ఫోకస్.
ఇవీ హామీలు
♦ గ్రామంలో తక్షణం వాటర్ ప్లాంట్ ఏర్పాటు
♦ ఆరోగ్య ఉపకేంద్రానికి శాశ్వతభవనం ఏర్పాటు
♦ గ్రామంలో అన్ని కార్యక్రమాలకు అవసరమైన కమ్యూనిటీహాలు ఏర్పాటు
♦ యువతీ యువకులకు స్వయం ఉపాధి కింద శిక్షణ
♦ గ్రంథాలయం ఏర్పాటు చేయడం
♦ గ్రామంలోని నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇప్పించి, ఏదో ఒకరంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం.
♦ గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద ఇంటింటికి చెత్తబుట్టలు పంపిణీ చేయడం.
♦ నిర్దేశించుకున్న సమయంలో అభివృద్ధి పూర్తి చేసి పంచాయతీలోని మిగిలిన గ్రామాలను అభివృద్ధి చేయడం
నెరవేరని హామీలు
2016 జనవరిలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంతవరకు కార్యరూపం దాల్చుకోలేదు. కమ్యూనిటీహాల్ నిర్మాణం, ఆరోగ్య ఉపకేంద్రం, గ్రంథాలయం ఏర్పాటు, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండ వంటి హామీలు రెండున్నర సంవత్సరాలు గడిచినా నెరవేరక పోవడంపై గ్రామస్తుల్లో నైరాశ్యం నెలకొంది. ఇంతకాలంలోను ఎస్పీ కేవలం రెండుమార్లు మాత్రమే గ్రామానికి వచ్చారు. గ్రా మంలోని యువతీయువకులకు శిక్షణ ఇచ్చిందీలేదు ఉపాధి అవకాశాలు కల్పించిందిలేదు. కనీసం అర్హులైన వారికి ఒక్కరికి కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా రాలేదు.
ఉన్నతాధికారులు ఏదో ఒకగ్రామాన్ని దత్తత తీసుకొంటే తద్వారా రాష్ట్రంలో కొద్దోగోప్పో అభివృద్ధి తమ ప్రమేయం లేకుండా జరుగుతుందనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. మండలంలోని సంగసముద్రం గ్రామాన్ని గతంలో పని చేసిన జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ 2015, ఫిబ్రవరి 18 తేదీన దత్తత తీసుకొన్నారు. దత్తత తీసుకొనే సమయంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో్ల అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారు. అప్పటికే వసతులు లేక అవస్థలు పడుతున్న గ్రామస్తుల్లో ఆనందం వ్యక్తమైంది. త్వరలోనే గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తుందని కలలుగన్నారు. ఎస్పీ సైతం గ్రామస్తులకు హామీల వర్షం కురిపించారు. అయితే దత్తత సమంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి మినహా మిగిలినవి నెరవేరలేదు. రెండేళ్లైనా అభివృద్ధి ఊసే లేదు.
నెరవేరిన ఒకే ఒక హామీ
దత్తత తీసుకున్న ఏడాది కాలం వరకు ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు 2016 జనవరి 20న గ్రామంలో వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే హంగామాగా దీన్ని ప్రారంభించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద కొందరికి చెత్తబుట్టలు పంపిణీ చేశారు.
దెబ్బతింటున్న శాంతి భద్రతలు
ఎస్పీ దత్తత తీసుకుంటే అప్పటికే గొడవలుగా ఉన్న గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని గ్రామస్తులు భావించారు. అయినా పాత పరిస్థితులే తలెత్తుతున్నాయి. పాతకక్షలు రగిలి ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకుని కేసులు పెట్టుకొన్నారు. సంక్రాంతి పండుగను మొదటి సారి ఇరువర్గాలు పోటాపోటీగా రెండు సార్లు జరుపు కున్నారు. ఇరువర్గాల దాడుల్లో పలువురు గాయాలపాలయ్యారు. ఇరువర్గాల వారు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వర్గపోరాటాలను అణచివేసి గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిం చారని గ్రామస్తులు చర్చించుకోవడం గమనార్హం
హామీలు నెరవేర్చాలి
గతంలో గ్రామాభివృద్ధికి ఎస్పీ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉంది. క మ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తే పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉం టుంది. గ్రంథాలయంతో ఎంతో ఉపయోగముంది. ఇప్పటికైనా ఘట్టమనేని శ్రీనివాస్ వీటిపై దృష్టిసారిస్తే బాగుంటుంది. – కృష్ణారెడ్డి. సంగసముద్రం
అభివృద్ధి జరిగిందిలేదు
గ్రామంలో వాటర్ ప్లాంట్ మినహా ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఇచ్చిన హామీలు హామీలూగానే మిగిలిపోయాయి. అర్హత కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. ఆరోగ్య ఉపకేంద్ర భవనానికి శాశ్వత భవన సౌకర్యంలేదు. గ్రామస్తుల ఆశలు అడియాశలయ్యాయి.– సాంబశివారెడ్డి, యల్లంపల్లె
Comments
Please login to add a commentAdd a comment