
ఆ సినిమాలో పాత్ర ఎంతో సంతృప్తి నిచ్చింది
భీమవరం : సినీ గాయని ఎస్.జానకి సూచనతోనే గాయకుడినయ్యానని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. చైతన్యభారతి సంగీత నృత్య నాటక పరిషత్ ప్రారంభ సభలో జీవిత సౌఫల్య పురస్కారాన్ని అందుకునేందుకు ఆయన భీమవరం విచ్చేశారు. ఈ సందర్భంగా శనివారం చైతన్య భారతి, కాస్మోపాలిటిన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ‘మాటాడుతా తీయగా’ పరిచయ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు.
1962లో గుడివాడలో కాళిదాసు కళానికేతన్ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాటలు పాడిన సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చిన జానకి తనను పిలిచి సినిమాల్లో ప్రయత్నించాలని సూచించారన్నారు. ఇంజినీర్ కావాలని ఇంజినీరింగ్ చదివిన తాను జానకి సూచనతో గాయకుడిగా మారానని చెప్పారు. చిత్ర పరిశ్రమ తనకు అందించిన సహకారం మరువలేనన్నారు.
పాటలకు న్యాయం చేయలేనని అనిపించినప్పుడు పాడటం మానేస్తానన్నారు. పాటలతోపాటు పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పాటలు, నాటకాలు రాయడం, ఫొటోలు తీయడం, ట్రావెలింగ్ తనకెంతో ఇష్టమన్నారు. మహ్మద్ రఫీ అంటే తనకెంతో ఇష్టమని, పాటల రచరుుత ఆత్రేయ తనకు తండ్రిలాంటి వారని అన్నారు.
40 వేల పాటలు పాడా..
మిధునం సినిమాలో పోషించిన పాత్ర తనకెంతో సంతృప్తినిచ్చిందని బాలు తెలిపారు. ఇప్పటివరకు 40 వేల వరకు పాటలు పాడానని, వీటిలో నాలుగు వేల గీతాలు తనకెంతో ఇష్టమని చెప్పారు. బాల్యంలో ఆటపాటలు ముఖ్యమని చదువు కూడా అంతే అవసరమన్నారు. ర్యాంకుల కోసం పిల్లలను వేధించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పటివరకు 66 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించానని చెప్పారు.
జూనియర్ గాయకులను ఎందుకు ఎదగనివ్వడం లేదని ఒకరు ప్రశ్నించగా వారి ఎదుగుదలను ఆపడానికి తానెవరినని ముక్తసరిగా సమాధానమిచ్చారు. నిర్వాహకులు బాలసుబ్రహ్మణ్యంను గజమాలతో సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు గోకరాజు రామరాజు, గజల్ శ్రీనివాస్, రాయప్రోలు భగవాన్ తదితరులు పాల్గొన్నారు.