‘ప్రత్యేక’ బంద్ విజయవంతం
వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతు
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. బంద్ నేపథ్యంలో మంగళవారం సెలవు ఇస్తున్నట్లు విద్యా సంస్థలు ముందుగానే ప్రకటించాయి. పెట్రోల్ బంకులు, లారీ ఓనర్స్ అసోసియేషన్, వ్యాపార సంస్థల యజమానులు, ప్రజలు సంఘీభావం ప్రకటించి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పలు ప్రాంతాల్లో మానవ హారాలు నిర్వహించారు.
న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేశారు. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు డిపోలు, బస్టాండ్ల నుంచి కదల్లేదు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 861 మందిని అరెస్టు చేశారు.
ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి అంత్యక్రియల రోజైన సోమవారం తిరుపతిలో బంద్ పాటించడంతో మంగళవారం అక్కడ బంద్‌కు మినహాయింపు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో బంద్ యథావిధిగా జరిగింది. విజయవాడలో నిర్వహించిన బంద్‌లో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు.