రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.
విజయనగరం టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాన కూడళ్లు, రహదారుల వద్ద నిఘా పెంచింది. మద్యం మత్తులో డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా రాకపోకలు సాగిస్తున్నవారిపై కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్‌లో అలా చేయకుండా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి సుమారు 44 లక్షల రూపాయల అపరాధ రుసుం వసూలు చేశారు. ఇటీవల కంటోన్మెంట్ వద్ద మద్యం మత్తులో స్కూల్ విద్యార్థులను ఢీకొన్న ఆటో డ్రైవర్ నమ్మి రమణకు రూ. 3 వేల జరిమానతో పాటు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది.
రాత్రి వేళల్లో కూడా ..
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రాత్రి వేళల్లో కూడా పోలీసులు గస్తీ కాస్తున్నారు.ఫేస్‌వాష్ పేరుతో పలు స్టేషన్‌ల పరిధిలో ఉన్న హైవేలపై వచ్చే లారీలను నిలుపుదల చేసి డ్రైవర్ల ముఖం కడిగించిన తర్వాత లారీలను పంపిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్నట్లైతే నేరుగా జైలుకే పంపిస్తున్నారు.
పగటి పూట అవగాహన
ప్రతి పోలీస్ అధికారి పగటి పూట ఆయా ప్రధాన జంక్షన్‌లలో మద్యం మహమ్మారి వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. అలాగే భవిష్యత్‌లో మద్యం సేవించి డ్రైవింగ్ చేయనని ప్రమాణం చేయిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత వాహన తనిఖీలు చేపట్టి మద్యంబాబులు పట్టుబడితే కేసులు నమోదు చేసి నేరుగా జైలుకు పంపిస్తున్నారు.