బొబ్బిలి రూరల్: ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. స్థానిక సీహెచ్‌సీలో ఆమె విలేకరులతో గురువారం మాట్లాడారు. ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, రక్తనిధి కేంద్రాలు అదనంగా కురుపాం, గజపతినగరం, భోగాపురం, విజయనగరంలలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తమ పరిధిలో 14 ఆసుపత్రులు ఉండగా, 12 ఏ గ్రేడ్‌లో ఉన్నాయని, భద్రగిరి, నెల్లిమర్ల సీ గ్రేడ్‌లో నిలిచాయన్నారు.
జిల్లాలో బీసీటీవీ(బ్లడ్ కలక్షన్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్) అనే మొబైల్ రక్తసేకరణ వాహనం ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా జిల్లాలో ఎవరు బ్లడ్‌క్యాంప్‌లు ఏర్పాటు చేసినా రక్తసేకరణ చేపడతామని చెప్పారు. అందరికీ రక్తం అందే ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లాలో మలేరియా, డెంగీ బారిన పడిన కేసులు 35నమోదయ్యాయన్నారు. ఆరోగ్యశ్రీ వార్డు బొబ్బిలిలో ఏర్పాటు చేస్తామని, 20కేసులు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఎముకల డాక్టర్ల కొరత ఉందని, పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. ఎనస్తీషియా, ఎముకల వైద్యులు, రేడియాలజిస్టులు ప్రభుత్వ ఆసుపత్రులలో చేరడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఆమె వెంట బొబ్బిలి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ జి.శశిభూషణరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment