‘అధికార’ జులుం | special focus on the searching way of income | Sakshi
Sakshi News home page

‘అధికార’ జులుం

Published Mon, Sep 15 2014 2:35 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

special focus on the searching way of income

 సాక్షి, ఒంగోలు: ‘అధికారంలోకి వచ్చాక కూడా చేతులు కట్టుకుని కూర్చోవాలా..? మీరు గ్రామంలో ఏమేం చెయ్యాలో ముందుగా మాకు చెప్పాల్సిందే.. మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. మేం చెప్పిన వారికి పనులు చేసిపెట్టాల్సిందే. అందుకు ఇష్టమైతేనే ఉండాలి. లేకుంటే, ఇంకోచోట పోస్టింగ్ వేయించుకోవడమే.. ఆల్రెడీ.. మాకు మంత్రిగారు, ఎమ్మెల్యే గారు చెప్పారు.

మాకు నచ్చని పనులు జరిగితే, వాళ్లకు చెప్పి ఊడబీకిస్తాం’ జిల్లా కేంద్రం నుంచి గ్రామస్థాయి పరిపాలనా కార్యాలయం వరకు ప్రస్తుతం వినిపిస్తోన్న బెదిరింపులు, హెచ్చరికల పర్వం ఇది.. అధికార పార్టీ నేతలు, పార్టీలో చోటామోటా గుర్తింపున్న కార్యకర్తలు సైతం ప్రభుత్వ పరిపాలనలో తమ పెత్తనం ఉండాలని కోరుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది అధికారపార్టీ నేతల ఫోన్‌లంటేనే ఉలికిపాటుకు గురవుతున్నారు.

ఇదేక్రమంలో స్థానిక  మంత్రితో పలువురు జిల్లా పర్యటనలకొస్తున్న ప్రభుత్వ పెద్దలు పార్టీకేడర్‌ను పక్కన నిల్చోబెట్టుకుని మరీ అధికారులతో సమీక్షలు చేయడం సమస్యగా మారింది. కొన్ని సందర్భాల్లో మంత్రులు అధికారులను పలు విషయాలపై ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడున్న పార్టీ వ్యక్తులు జోక్యం చేసుకుని సమాధానాలు, ఫిర్యాదులు చేయడం గందరగోళానికి గురిచేస్తోంది. గ్రామ, మండల స్థాయిల్లో చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి, రేషన్‌డీలర్, అంగన్‌వాడీ టీచర్ దగ్గర్నుంచి ఆయాపోస్టుల్లో  పనిచేస్తున్న వారిని సైతం బెదిరిస్తూ హల్‌చల్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

 సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, కొండపి నియోజకవర్గాలతో పాటు ఒంగోలు నగరంలోనూ అధికారపార్టీ నేతల దందా పెచ్చుమీరుతోంది. ప్రకాశం భవన్ వద్ద నిత్యం తిష్టవేస్తున్న ఇద్దరు తెలుగు తమ్ముళ్లు సందర్శకులపై ప్రత్యేక నిఘా ఉంచి .. వివరాలను ఆరాతీస్తుండటం గమనార్హం. జిల్లా ఉన్నతాధికారులను ఎవరెవరు కలుస్తున్నారు..? ఏఏ విషయాలు మాట్లాడుతున్నారనే.. సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

 అదేవిధంగా దర్శి తాలూకా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి చెందిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నిత్యం వచ్చిపోతున్నారు. వారు సిఫార్సు చేసిన వారికే లబ్ధిచేకూర్చాలని.. వైరిపార్టీలకు చెందిన వారిని దూరంగా పెట్టాలంటూ బహిరంగంగా అధికారులకు చెబుతున్నట్లు తెలుస్తోంది.

 సగానికిపైగా అనధికార డీలర్‌షిప్పులు..
 దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనే ఎత్తుగడతో నిన్నటిదాకా టీడీపీలో చోటామోటా నేతలుగా ఎదిగిన వారు నేడు ఎవరికివారు గ్రామాల్లో పవర్ పాలిట్రిక్స్‌కు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ప్రజాపంపిణీ దుకాణాలపై కన్నేసిన తెలుగు తమ్ముళ్లు రేషన్‌డీలర్లను బెదిరించి.. నెలవారీ సరుకుల డీడీలు తీయించకుండా అడ్డుకుంటున్నారు.

ఇకనుంచి, ప్రజాపంపిణీ దుకాణాలను తామే నడుపుకుంటామని.. డీడీలు కూడా తామే చెల్లించుకుంటామని ఆర్డర్ జారీచేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సగానికిపైగా దుకాణాలను అధికార పార్టీకి చెందిన వ్యక్తులే అనధికారికంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. డీలర్‌షిప్ లెసైన్స్ ఉండి కూడా వ్యాపారం చేయలేని బాధితులు కలెక్టర్, పౌరసరఫరాల అధికారికి మొరపెట్టుకుంటున్నా.. ఫలితం ఉండటం లేదు.

 అంగన్‌వాడీ, ఉపాధిహామీ పోస్టుల పరిస్థితీ అంతే. కొన్ని మండలాల్లో ప్రభుత్వ టీచర్లు, ఎంఈవో స్థాయి అధికారులపైనా అధికారపార్టీ పెత్తనం చేస్తోంది. మాటవినని సిబ్బందిపై ఆకస్మిక తనిఖీల పేరుతో వేటేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇటీవల కనిగిరి నియోజకవర్గం సీఎస్‌పురంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోగా, అద్దంకి, బల్లికురవ మండలాల్లో రేషన్ దుకాణాల్లో రిజిస్టర్‌లనే కొందరు మాయం చేసి.. డీలర్లును ఇరికించిన ఘటనలు వెలుగులోకొచ్చాయి.

 అధికారుల మనస్తాపం..
 రెవెన్యూ కార్యాలయాల్లో పాగా వేస్తున్న తెలుగు తమ్ముళ్లు అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడం వివాదానికి దారితీస్తోంది. పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ, ఇంటిపట్టా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల విషయంలో తాము చెప్పిన వారికే అందజేయాలంటూ హుకుం జారీచేస్తున్నారు. పనిఒత్తిడి నేపథ్యంలో సిబ్బంది ఒకట్రెండు విషయాల పట్ల నెమ్మదిస్తే... వారిని వైరిపార్టీకి చెందిన వ్యక్తులుగా చిత్రీకరిస్తూ రాద్ధాంతం చేయడం రివాజైంది. ఇటీవల ఒంగోలు తాలూకా రెవెన్యూ కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాల మంజూరుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే తెలుగుతమ్ముళ్లు ప్రభుత్వ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పైగా, అధికారులు తమపార్టీకి చెందిన వారు కాదని కావాలనే తమ పనుల విషయంలో జాగు చేస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు. ఇలాంటప్పుడు సీనియర్ అధికారులు సైతం తప్పుచేసిన వారిలాగా తలొంచుకుని ఉండాల్సి వస్తోంది. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. మౌనంగా మనస్తాపానికి గురవుతున్నారు. ఇదేవిధంగా టీడీపీ తమ్ముళ్ల చర్యలు కొనసాగితే, అన్నివర్గాల్లో మూకుమ్మడి అసంతృప్తి రగులుతుందని ప్రజాసంఘాల నేతలంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement