పూలే వెలుగులో..అంబేడ్కర్‌ అడుగుజాడల్లో.. | Special Interview With Justice Eswaraiah Goud | Sakshi
Sakshi News home page

పూలే వెలుగులో..అంబేడ్కర్‌ అడుగుజాడల్లో..

Published Fri, Oct 18 2019 4:11 AM | Last Updated on Fri, Oct 18 2019 4:14 AM

Special Interview With Justice Eswaraiah Goud - Sakshi

సామాజిక న్యాయం దిశగా.. 
‘మాటలు కంటే ఆచరించి చూపడం ముఖ్యం. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం విషయంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతికి బాటలు వేస్తున్నారని నేను విశ్వసిస్తున్నా. జ్యోతిరావ్‌ పూలే, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా వారు చూపిన దారిలో పయనిస్తున్నారు. పేదలకు, అణగారిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానం కచ్చితంగా లబ్ధిచేకూర్చుతుందనడంలో సందేహంలేదు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ నాణ్యమైన ఉచిత విద్యను అందించడంతో పాటు ఉన్నత విద్యను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పవచ్చు’.

కమిషన్లకు ఉండే అధికారాలు ఏమిటంటే..
►పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షక సంఘాలన్నీ సహజంగా విద్యా ప్రమాణాల పెంపునకు కృషిచేస్తుంటాయి.  
►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నియంత్రణ సంస్థలు ఎప్పటికప్పుడు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా మౌలిక వసతులు, ప్రవేశాలు, బోధన, పరీక్షలు, పరిశోధన, అధ్యాపకుల అర్హత ప్రమాణాలు పెంపొందిస్తాయి.
►పాఠశాల, ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఈ సంఘాలకు అధికారాలు ఉంటాయి.
►ఉపాధ్యాయ సర్వీస్‌ కమిషన్లను నియంత్రించే అధికారం ఉంటుంది.  
►విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరిస్తుంటాయి. ఈ కమిషన్లు ఇచ్చే ఆదేశాలను అమలుచేయించడంతో పాటు జరిమానాలు విధించే అధికారాలు కూడా వీటికి ఉంటాయి.  
►ఒక మాటలో చెప్పాలంటే సివిల్‌కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. సమన్లు జారీ చేయడం మొదలు సాక్ష్యాధారాలను రాబట్టే వరకు కమిషన్ల పరిధి ఉంటుంది.

ఉన్నత ప్రమాణాలే లక్ష్యం.. 
‘రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఉన్నత విద్యలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తా. ఆయన నాపై ఉంచిన విశ్వాసాన్ని నెరవేరుస్తా. ఏపీ లోకాయుక్త చట్టానికి సవరణ తీసుకువచ్చి లోకాయుక్తను సమర్ధంగా అమలుచేసి అవినీతి రహిత ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటుచేసేలా ఆ వ్యవస్థకు రిటైర్డ్‌ న్యాయమూర్తిని నియమించడం హర్షణీయం’.

జగన్‌ బడుగుల పక్షపాతి.. 
‘సీఎంగా వైఎస్‌ జగన్‌ తీసుకున్న పలు చర్యలు ఆయన బీసీల పక్షపాతి అని నిరూపిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ అభ్యున్నతికి నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం, ఆలయాలలో ట్రస్టీలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం, వర్క్‌ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు వంటివి అనేకం ప్రస్తావించవచ్చు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాహసోపేత నిర్ణయం’.

‘బడుగుల కల నెరవేరబోతోంది.సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి రానుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల అమలు దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. బీసీలకు ఉచితంగా, నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు  వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న చర్యలే ఇందుకు నిదర్శనం. వీటితోపాటు రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల సమస్యలపైనా దృష్టిసారించారు.

ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం’.. అని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ) చైర్మన్‌గా నియమితులైన జస్టిస్‌ వంగల ఈశ్వరయ్య గౌడ్‌ అభిప్రాయపడ్డారు.  ఆయనతో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి.. 
    – సాక్షి ప్రతినిధి, అమరావతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement