అక్కడ నిత్యం రెండు వేలకు పైగా పడవల్లో మత్స్యకారులు జీవన పోరాటం సాగిస్తుంటారు. వింత చేపలు, అరుదైన జాతులకు అది ఆలవాలం. ‘తూర్పు’ తీరంలోని దాదాపు 20 వేల కుటుంబాలకు అక్కడ లభ్యమయ్యే జలచరాలే పెద్ద సంపద. అయితే వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, పడవలు లంగరు వేసేందుకు ఫిషింగ్ హార్బర్ లేకపోవటంతో మత్స్యకారుల కష్టం వృథాగా మారుతోంది. వారి కష్టాలను తీర్చేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తూర్పు గోదావరి జిల్లాలో మినీ హార్బర్ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేయించినా ఆయన ఆకస్మిక మృతితో తరువాత ప్రభుత్వాలు ఆ విషయాన్ని గాలికి వదిలేశాయి. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.300 కోట్లకు చేరుకున్న దశలో ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా మత్స్యకారులకు నమ్మకం కలగడం లేదు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కలగానే మిగిలిపోయింది. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు తీరంలో ఎక్కడా జట్టీలు, హార్బర్‌లు లేవు. దీంతో కొత్తపల్లి, తొండంగి, తుని మండలాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, బోట్లు లంగరు వేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా కొత్తపల్లి మండలం మత్స్యకారులు ఉప్పాడ సమీపంలోని ఉప్పుటేరుని జట్టీగా వినియోగించుకుంటున్నారు. అది అనువుగా లేకున్నా బోట్లను ఉప్పుటేరులోనే లంగరు వేసి చేపలను ఒడ్డుకు మోసుకొచ్చి నడి రోడ్డుపైనే విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తొండంగి, తుని మండలాల మత్స్యకారులకు ఆ అవకాశం కూడా లేక పడవలను సముద్రంలోనే లంగరు వేసి దేవుడిపైనే భారం మోపుతున్నారు.
కెరటాల తాకిడికి మునుగుతున్న బోట్లు
తుపాన్లు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బోట్లను ఒడ్డుకు తెచ్చే అవకాశం ఉండదు. సముద్రంలో లంగరు వేసిన బోట్లు కెరటాల ఉధృతికి నీట మునిగి మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి సమయాల్లో బోట్లు, వలలు లాంటి విలువైన ఉపకరణాలను అతి కష్టం మీద వ్యయప్రయాసల కోర్చి గ్రామాలకు దూరంగా ఎక్కడ వీలైతే అక్కడ ఎటువంటి రక్షణా లేకుండా ఒడ్డుకు తరలిస్తున్నారు. ఒక్కోసారి లంగరు వేసిన బోట్లలో సామాగ్రిలు చోరీలకు గురవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకొనేందుకు, బోట్లను ఒడ్డుకు చేర్చే మత్స్యకారులకు హార్బర్ సురక్షిత ప్రాంతం. కానీ తూర్పు గోదావరి తీరంలో మినీ హార్బర్ లేక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఫలించని డ్రెడ్జింగ్ పనులు..
సముద్రంలో చేపల వేట అనంతరం వాటిని ఒడ్డుకు చేర్చి హార్బర్‌లో విక్రయించేందుకు వీలుంటుంది. అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల చేపలు పాడయ్యే అవకాశం ఉండదు. ఇక్కడ లభ్యమయ్యే మత్స్య çసంపదను బెంగళూరు, కోల్‌కత్తా, చెన్నై, కేరళ తదితర చోట్లతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ దొరికే వింత చేపలు, అరుదైన జాతులకు మంచి గిరాకీ ఉన్నా హార్బర్ సదుపాయం లేదు. ఇక బోట్లు మరమ్మతులకు గురైనా, గుక్కెడు నీళ్లు కావాలన్నా కిలోమీటర్ల దూరం వెళ్లాలి. వేసవిలో సూర్యభగవానుడి భగభగలకు మాడిపోవాల్సిందే. ఇన్ని సమస్యలున్నా ఇక్కడ రోజూ లక్షల్లో వ్యాపారం జరగటం గమనార్హం. మత్స్యకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బోట్లు ఒడ్డుకు చేరేలా తాత్కాలికంగా సుమారు రూ. 1.25 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు చేపట్టినా రెండో రోజే ఇసుక మేట వేయటంతో నిధులు నిరుపయోగంగా మారాయి.
నిధులు మంజూరు చేయించిన వైఎస్సార్
మత్స్యకారుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో సుమారు రూ.50 కోట్లతో మినీ హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి నిధులు కూడా మంజూరు చేయించారు. వైఎస్సార్ మృతితో ఇక ఆ విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అనంతరం కొత్తపల్లి మండలం అమీనాబాద్ శివారు పెట్రోలు బంకు వద్ద సముద్రం పక్కనే ఉన్న సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమి మినీ హార్బర్ నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పుడు హార్బర్ నిర్మాణ అంచనా వ్యయం రూ. 300 కోట్లకు చేరింది. తాజాగా హార్బర్ ప్రతిపాదనను 28 ఎకరాలకు పరిమితం చేశారని తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణంపై ప్రభావం తదితర అంశాలను పరిశీలించకుండా నిర్మాణం ముందుకు సాగదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇది కూడా ప్రకటనకే పరిమితమని మత్స్యకారులు భావిస్తున్నారు.
జెట్టీ లేక తీవ్ర ఇబ్బందులు
హార్బర్ నిర్మాణానికి సంబంధించి వైఎస్సార్ హయాంలో జీవో విడుదలైనా తరువాత ప్రభుత్వాలు పట్టించుకోక కార్యరూపం దాల్చలేదు. వేటపై ఆధారపడిన మత్స్యకారులు జెట్టీ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మత్స్య సంపదతో రూ. కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రభుత్వం మత్స్యకారుల సౌకర్యాలపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు.
– కర్రి నారాయణ , అఖిల భారత మత్స్యకార సమాఖ్య సభ్యుడు, కాకినాడ
ప్రభుత్వం సిద్ధంగా ఉంది
మినీ హార్బర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నాం. నిబంధనల మేరకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
– కోటేశ్వరరావు (మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, తూర్పు గోదావరి జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment