మానవ మృగాలు మారవా.. అసలు చట్టంలో ఏముంది? | Special Story On POCSO ACT | Sakshi
Sakshi News home page

పిల్లలకు రక్షణ కవచం ‘పోక్సో’ చట్టం

Published Fri, Jun 28 2019 12:47 PM | Last Updated on Fri, Jun 28 2019 1:45 PM

Special Story On POCSO ACT  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్టణం : నేడు సాంకేతిక విజ్ఞానం, స్మార్ట్‌ఫోన్ల వినియోగం మితిమీరి మనిషి భవితకు సవాల్‌గా మారింది. అడ్డు అదుపులేని సమాచార విప్లవం, నీలిచిత్రాలు ముక్కుపచ్చలారని చిన్నారుల బాల్యాన్ని ఛిద్రం చేస్తున్నాయి. దేశ జనాభాలో 40 శాతం 18 సంవత్సరాల లోపు వారు ఉంటే, 53 శాతం చిన్నారులు లైంగిక లేదా ఇతర వేధింపులకు గురవుతున్నారు. సురక్షిత, రక్షణ వాతావరణం లేకుండా సమాజం నేడు తయారవుతోంది. పిల్లల్లో మానసిక, సామాజిక ఎదుగుదలకు అవరోధం జరిగే సంఘటనల నుంచి పోక్సో (ప్రొటక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్స్‌వల్‌ అఫెన్స్‌స్‌) చట్టం రక్షణ కల్పిస్తోంది. ఈ చట్టం అవగాహనపై ప్రత్యేక కథనం.

ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అయినా మానవ మృగాల తీరులో మార్పులేదు. వయస్సుతో ప్రమేయం లేకుండా చిన్నారులపై కిరాతకంగా లైంగిక దాడులకు పాల్పడుతూ వారి జీవితాలను బుగ్గి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు నేరగాళ్ల నుంచి రక్షణ కల్పించడానికి 2012లో లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 (పోక్సో)ను అమలులోకి తెచ్చారు. 2013లో ఆర్డినెన్స్‌ను జారీ చేసిన ప్రభుత్వం పిల్లలు, స్త్రీ  పట్ల లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలకు పాల్పడితే ? వారిపట్ల కఠిన శిక్షలు ఉండే విధంగా చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది.

చట్ట పరిధిలోకి వచ్చే ఘటనలు..
18 సంవత్సరాలలోపు పిల్లలు మైనర్లు ఈ చట్టం పరిధిలో లైంగిక దాడి, దారుణమైన లైంగిక హింస, లైంగిక వేధింపులు, అశ్లీల సాహిత్యానికి పిల్లల వినియోగం వంటివి. దాంతో పాటు పిల్లలను ఉపయోగించి తీసిన అశ్లీల చిత్రాలను నిల్వ చేయడం. 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు తమ సర్వసమ్మతిని ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి బాలబాలికలు ఆమోదం తెలిపినా లైంగిక చర్యలకు పాల్పడిన వ్యక్తిని నేరస్తుడిగా భావిస్తారు. 18 సంవత్సరాల పిల్లల పట్ల జరిగిన లైంగిక దాడుల విషయాలను ఇతరులకు తెలియజేయకుండా దాచడం నేరమే అవుతుంది. పిల్లలపై ఫలానా వ్యక్తి నేరం చేశాడని తెలిసిన వెంటనే పోలీసులకు ఆ వ్యక్తి ఫిర్యాదు చేయాలి.

ఐపీసీ–376లో నూతన సవరణలు
గత ఏడాది కేంద్ర మంత్రి వర్గం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) 376లో పలు సవరణలు చేసింది. లైంగిక దాడుల ఘటనల్లో నేరస్తుల శిక్షలను విస్తృత పరిచింది. పిల్లల వయస్సు 18 నుంచి 16 సంవత్సరాల లోపు, 12 నుంచి 16 సంవత్సరాలలోపు, 16 నుంచి 18 సంవత్సరాలలోపు విభాగాల్లో విభిజించి దానిప్రకారం శిక్ష విధించే విధంగా మార్పులు తీసుకువచ్చింది. ఐపీసీ 376లో 3 సబ్‌ సెక్షన్లను చేర్చారు.

సెక్షన్‌ 376 ఎ ప్రకారం
12 సంవత్సరాల్లోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పై కోర్టులో నేరనిరూపణ అయితే 20 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష నుంచి జీవితకాలం జీవిత ఖైదుగా లేదా మరణ శిక్షను కోర్టు విధించవచ్చు. దీంతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. జరిమానా సొమ్మును బాధిత బాలికకు వైద్య ఖర్చలకు, పునరావాసానికి ఇవ్వాల్సి ఉంటుంది.

సెక్షన్‌ 376 ఈ ప్రకారం
16 సంవత్సరాలలోపు బాలికపై ఇద్దరు లేక ఎక్కువ మంది లైంగిక దాడికి (గ్యాంగ్‌ రేప్‌)కు పాల్పడిన నిందితులపై లేదా నేర నిరూపణ అయితే జీవిత ఖైదు లేదా నిందితులు మరణించే వరకు జైలు శిక్ష విధించవచ్చు. జరిమానా లేదా శిక్ష, జరిమానా రెండు కలిపి విధించవచ్చు. జరిమానా సొమ్మును బాధితురాలు వైద్య ఖర్చులకు పునరావాసానికి సరిపోయే విధంగా చెల్లించాలని తీర్పులో పేర్కొనవచ్చు.

సెక్షన్‌ 376 డి ప్రకారం
12 సంవత్సరాలలోపు బాలికలపై గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడిన నిందితులకు పూర్తి జీవిత కాలం(మరణించేంత వరకూ) లేదా ఉరి శిక్ష, జరిమానాను కోర్టులు విధించవచ్చు. జరిమానా సొమ్ము బాధిత బాలిక వైద్య ఖర్చులకు, పునరావాసానికి సరిపోయే విధంగా కోర్టులు విధించవచ్చు. ఒకొక్కసారి జరిమానాతో పాటు బాధితురాలికి నిందితుడు పరిహారం చెల్లించాలని కోర్టులు తీర్పు చెప్పవచ్చు.

లైంగిక దాడికి పాల్పడితే పదేళ్ల జైలు
గతంలో లైంగిక దాడులకు పాల్పడినట్లు కోర్టులో రుజువైతే ఏడు సంవత్సరాలకు తగ్గకుండా జీవిత ఖైదు వరకు శిక్ష విధించవచ్చునని చట్టం తెలుపుతుంది. ప్రస్తుతం సవరణలో కనీస శిక్ష ఏడు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. పది సంవత్సరాలకు తగ్గకుండా జీవితఖైదుగా విధించవచ్చు. ఐపీసీ సెక్షన్‌  376 ఏ తదుపరి 376ఏ,బీ ని పొందుపరిచారు. దీని ప్రకారం అత్యాచారం చేసి చంపడం అత్యాచారంతో పాటు విపరీత ధోరణిలో గాయపరచడం బాధిత మహిళ స్పృహ కోల్పోయేటట్టు చిత్రహింసలకు గురిచేయడం ప్రత్యేక నేరంగా పరిగణిస్తారు.

ముందస్తు బెయిల్‌ లేదు
12 సంవత్సరాలలోపు, 16 సంవత్సరాలలోపు పిల్ల్లలపై అత్యాచారాలకు పాల్పడడం, చంపడం గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడడం వంటి కేసుల్లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నవారికి కోర్టుల్లో ముందస్తు బెయిల్‌ (యాంటిస్పేటెరీ బెయిల్‌) ఇవ్వరు.

విచారణ
► నేర పరిశోధన రెండు నెలల్లోపు పూర్తి చేయాలి. త్వరితగతిన నేర విచారణకు వచ్చే విధంగా చేయాలి.
► పోక్సో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్‌  376సబ్‌ సెక్షన్‌లలో నమోదైన కేసులను విచారణ జరిగిన తర్వాత  శిక్షాకాలం ఏదీ ఎక్కువ ఉందో ఆ చట్టాన్ని అమలు చేస్తారు. ∙చార్జిషీటు ► వేసిన రెండు నెలల్లోపు కేసు విచారణ చేపట్టాలి. కింది కోర్టు తీర్పుపై అప్పీలు దాఖలు చేసిన తేదీ నుంచి ఆరు నెలలలోపు విచారణ చేపట్టాలి. ఐపీసీ సెక్షన్‌  376 సబ్‌ సెక్షన్‌  3, ► 376 ఏబీ, 376 డీఏ, 376 డీబీ కింద నమోదైన కేసుల్లో బెయిల్‌ పిటీషన్‌  కోర్టుల్లో దాఖలు చేసిన మీదట 15 రోజులు తగ్గకుండా  పబ్లిక్‌  ప్రాసిక్యూటర్‌కు నోటీసుఇచ్చి బెయిల్‌æ ► పిటీషన్‌పై విచారణ చేపట్టాలి. ∙సెక్షన్‌ 376 సబ్‌ సెక్షన్‌  3, 376ఏ బీ, 376 డీ ఏ, 376 డీబీ కింద నమోదైన కేసుల్లో పిటీషన్‌పై కోర్టులో పలనా వాయిదా రోజు విచారణ      జరగుతుందని పోలీసులు బాధితురాలికి కాని, ఆ బాలిక సంరక్షకులకు గాని వాయిదా తేదీలను తెలియజేయాలి.

పర్యవేక్షణ ఇలా...
►   హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిషన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
► జాతీయస్థాయిలో బాలల హక్కుల కమిషన్‌ చట్టం పనిచేసే తీరును పరవేక్షిస్తుంది.
►  చట్టం పరవేక్షణకు ఎన్‌సీపీసీఆర్‌(నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటక్షన్‌ చైల్డ్‌ రైట్స్‌), ఎస్‌సీపీసీఆర్‌ (స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటక్షన్‌ ఫర్‌ చైల్డ్‌) మానటరింగ్‌ అథారిటీ పనిచేస్తుంది.
►  జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, జిల్లా బాలల సంరక్షణ విభాగం(సీడబ్ల్యూసీ), జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ పనిచేస్తుంది.
 బాలలకు అత్యవసరవైద్య చికిత్స, ఆదరణ, రక్షణకు కావాల్సిన ఏర్పాట్లను, నష్టపరిహారం చెల్లింపు కమిషన్‌  చూస్తుంది.
బాలల సహాయానికి ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తాయి. ఫిర్యాదు అందిన తక్షణమే ఆదరణ, రక్షణ కల్పించి 24 గంటల్లో నివేదికను బాలల సంక్షేమ కమిటీకి అందజేయాలి. ఇతర సహాయానికి 100, 1098, 181 నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చు.

తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలి
ఇటీవల కాలంలో పిల్లలపై తల్లిదండ్రులు, సంరక్షకులు (గార్డ్యిన్స్‌) పర్యవేక్షణ పూర్తిగా తగ్గింది. పిల్లల కదలికలను పెద్దలు గమనిస్తూ ఉండాలి. 18 సంవత్సరాలలోపు పిల్లలు సెల్‌ఫోన్లు కలిగి ఉంటే తల్లిదండ్రుల పేరుపై మాత్రమే సిమ్‌ కార్డు ఇవ్వాలి. వేరొకరి పేరున పిల్ల్లలకు సిమ్‌కార్డులు ఇచ్చినా అది నేరంగా పరిగణించాలి. పిల్లల సెల్‌ఫోన్లకు వచ్చే ఇన్‌ కమింగ్, ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ వివరాలు వారి తల్లిదండ్రులు తెలుసుకునే ఏర్పాట్లు చేయాలి. పిల్లలకు మారణాయుధాలు, డ్రగ్స్, మద్యపానం అమ్మకూడదని ప్రభుత్వం చట్టం ఎలా చేశాయో అలాగే పిల్లలకు సెల్‌ఫోన్‌లు కూడా కేవలం సమాచారం ఇచ్చే విధంగా ఉండేటట్టు ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. హాస్టళ్లల్లో పిల్లలకు వార్డెన్‌ పర్యవేక్షణలో ఫోన్లు ఉండేటట్టు చూడాలి. పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారిని ధైరంగా పోలీసులకు పట్టించి ఫిర్యాదు చేయాలి. సెల్‌ ఫోన్లలో టెక్నాలజీని పిల్లలకు దూరం చేయాలి. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికి సమాజంలోను, తల్లిదండ్రులలోను మార్పు రావాలి. ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చిన రోజునే చట్టాలు కూడా పూర్తి స్థాయిలో అమలు అవుతాయి. పోక్సో చట్టంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలి.                
–లాలం పార్వతినాయుడు, సీనియర్‌ న్యాయవాది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement