లెక్క తేలాల్సిందే! | Special Team To Investigate School Funds | Sakshi
Sakshi News home page

లెక్క తేలాల్సిందే!

Published Wed, Jun 19 2019 10:19 AM | Last Updated on Wed, Jun 19 2019 10:20 AM

Special Team To Investigate School Funds - Sakshi

మచిలీపట్నంలోని దేశాయిపేట పాఠశాల

ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు మంజూరైన నిధుల వినియోగంపై లెక్క తేల్చేందుకు విద్యా శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం నుంచి ఈ నెల 24 వరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు సంబంధించిన రికార్డులను పరిశీలించనున్నారు. రాష్ట్రీయ మాధ్యమిక విద్యా విభాగానికి చెందిన ప్రత్యేక అధికారులతో కూడిన బృందం ఇందుకోసం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 3,157 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 500 వరకు సెకండరీ పాఠశాలలు (హైస్కూల్‌ స్థాయి) ఉన్నాయి.

సాక్షి, మచిలీపట్నం: పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా వివిధ రకాలుగా నిధులు మంజూరు చేస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్వ శిక్షాభియాన్‌ విభాగం నుంచి, ఉన్నత పాఠశాలలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్‌ విభాగం నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. వీటితో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌(పాఠశాల సముదాయం)గా గుర్తించిన వాటికి ప్రత్యేకంగా ఏడాదికి సుమారుగా రూ. 20 వేల వరకు నిధులు మంజూరు చేస్తున్నారు.

గతంలో స్కూల్‌ గ్రాంట్, మెయింటినెన్స్‌ రూపేణా వేర్వేరుగా నిధులు విడుదల చేయగా, 2017–18 విద్యా సంవత్సరంలో ఈ రెండింటినీ కలిపి, విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న సెక్షన్లను పరిగణనలోకి తీసుకుని స్కూల్‌ గ్రాంట్‌ రూపేణా నిధులు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలకు రూ. 12,500,  ఉన్నత పాఠశాలలకు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు ఇచ్చారు. అదేవిధంగా మండల స్థాయిలోని విద్యా వనరుల కేంద్రాల నిర్వహణ కోసం రూ. 34 వేల నుంచి రూ.50 వేల వరకు మంజూరు చేశారు. ఇవే కాకండా పాఠశాలల్లో స్వచ్ఛభారత్‌ పేరిట, టీఎల్‌ఎం మేళా,  సైన్స్‌ఫేర్‌ నిర్వహణ, విద్యార్థులను ఎక్స్‌కర్షన్‌ ట్రిప్‌కు తీసుకువెళ్లేందుకు ఇలా వివిధ రకాలుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. వీటిని ఎలా వినియోగించారనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం అధికారులు పరిశీలనకు సిద్ధమయ్యారు. 

షెడ్యూల్‌ ఇలా..
జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, నూజివీడు. నందిగామ డివిజన్‌ల వారీగా ఆర్‌ఎంఎస్‌ఏ బృందం సభ్యులు పర్యటించనున్నారు. డివిజన్‌ కేంద్రాల్లోని ఒక చోట అందుబాటులో ఉంటారు. ఆయా డివిజన్‌ పరిధిలోని అన్ని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తగిన రికార్డులు, నివేదికలతో హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నెల 20న గుడివాడలోని ఎస్‌పీఎస్‌ మున్సిపల్‌ హైస్కూల్,  21న నూజివీడులోని డెప్యూటీ డీఈఓ కార్యాలయం, 22న విజయవాడ, నందిగామ డివిజన్‌లకు చెందిన పాఠశాలల రికార్డులను పరిశీలించనున్నారు. రెండు డివిజన్‌లకు చెందిన ఉపాధ్యాయులంతా విజయవాడలోని పటమట జెడ్పీ బాలికల  ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. 24న మచిలీపట్నంలోని ఆర్‌సీఎం హైస్కూల్లో బృందం అందుబాటులో ఉండి డివిజన్‌లోని పాఠశాలల నివేదికలను పరిశీలించనున్నారు.  

సమగ్ర పరిశీలన 
బ్యాంక్‌ స్టేట్‌మెంట్, 2019 మార్చి 31 వరకు జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, నిధుల మంజూరీకి సంబంధించిన అనుమతి పత్రాలు, ఇతర ఉత్తర్వులు సిద్ధం చేసుకొని తీసుకువెళ్లాలి. అదేవిధంగా లావాదేవీలకు సంబంధించిన పుస్తకం, నగదు నిల్వ పుస్తకం, ఇందుకు సంబంధించిన పత్రాలు, బ్యాంకులో కాకుండా చేతిలో ఉన్న నగదు, ఎందుకు నగదు ఉంచుకున్నారనే దానిపై తగిన ధ్రువీకరణ పత్రాలు తీసుకువెళ్లాలి. పాఠశాలల్లో చేసిన సివిల్‌ వర్క్స్‌ వివరాలు, వాటికి వెచ్చించిన నిధులు, మెజర్‌మెంట్‌ (ఎంబుక్‌) పుస్తకం, పాఠశాల అభివృద్ధి కమిటీ తీర్మానాల పుస్తకం, మిగులు నిధులు బ్యాంకులో చెల్లిస్తే, వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను విచారణ బృందానికి అందజేయాల్సి ఉంటుంది. వీటిని సమగ్రంగా పరిశీలన చేసి ఆర్‌ఎంఎస్‌ఏ బృందం విద్యా శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే మళ్లీ పాఠశాలలకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది.  నిధుల వినియోగానికి సంబంధించి సమగ్ర నివేదికలతో ఆడిట్‌ బృందం ముందు హాజరుకావాలని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలను ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement