ఐదేళ్లలోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం
తొలిరోజు 327 టోకెన్లపై 627 మందికి దర్శనం
తిరుపతి అర్బన్: ఏడాదిలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకే కాకుండా ఐదేళ్లలోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు కూడా తిరుమల వెంకన్న దర్శన భాగ్యాన్ని కల్పించాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి బుధవారం పిల్లల తల్లిదండ్రులను తిరుమలలోని సుపథం ప్రవేశమార్గం ద్వారా అనుమతించి స్వామివారి దర్శనం కల్పించనున్నారు. తొలిరోజు బుధవారం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మొత్తం 327 మంది పిల్లలకు టోకెన్లు జారీ చేయగా, వారి తల్లిదండ్రులతో కలిసి 627 మంది శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇటీవల కొందరు భక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే కార్యక్రమం ద్వారా ఈనెల 26న కూడా ఐదేళ్లలోపు పిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం ప్రవేశ మార్గంలో శ్రీవారి దర్శనానికి అనుమతించాలని ఈవో అధికారులను ఆదేశించారు.