సాక్షి, అనంతపురం : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి పలువురు తెలుగువాళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు. అనంతపురంకు చెందిన టీడీపీ నేత, ఎస్‌ఆర్ కనస్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్ర బాబు బృందం కొలంబోకు విహార యాత్రకు వెళ్లింది. ఆదివారం ఉదయం సురేంద్ర బాబు మిగతా నలుగురు స్నేహితులు షాంగ్రీలా హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా బాంబు పేలింది. ఈ సందర్భంగా తోపులాట జరగగా అమిలినేని సురేంద్ర బాబు స్వల్పంగా గాయపడ్డారు. కొంచెం తేరుకుని ప్రాణభయంతో హోటల్ ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు వచ్చేసినట్లు బాధితులు తెలిపారు. అనంతరం అమిలినేని సురేంద్ర బాబు తాను క్షేమంగానే ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే వీరికి సంబంధించిన పాస్‌పార్ట్‌లు, లగేజీ హోటల్ గదిలోనే ఉండిపోవడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
మరోవైపు శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అప్రమత్తం అయ్యింది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్‌చేశారు. ఘటనలో భారతీయులెవరైనా చనిపోయారా లేక గాయపడ్డారా అన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు ప్రకటించారు. బాధితుల సహాయార్థం కొలంబోలోని ఇండియన్ హై కమిషన్ ప్రత్యేక సెల్ ఏర్పాటుచేసింది. అత్యవసర సేవల కోసం సంప్రదించడానికి ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసింది.
అలాగే శ్రీలంకలోని భారతీయ సంఘాలు కూడా సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శ్రీలంక ప్రధానితో ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి సాయం చేసేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా శ్రీలంక ప్రధానికి తెలిపారు. కాగా బాంబు దాడుల నుంచి సినీనటి రాధిక తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మారణహోమానికి పాల్పడింది జహ్రాన్ హహీమ్, అబు మహ్మద్‌గా నిర్థారణకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment