వెంకన్నకు శఠగోపం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగరం ఆర్‌ఆర్ పేట ఆలయంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామికి వజ్ర కిరీటం పేరిట ఓ అధికారి లక్షలాది రూపాయలు దండుకున్నా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారు. నిలువెత్తు స్వామికి వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని బహూకరించి కనులారా వీక్షిద్దామన్న ఉద్దేశంతో భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన సొమ్ములను దిగమింగేసిన సదరు అధికారిని బదిలీ చేసి చేతులు దులిపేసుకున్నారు. ఏడెనిమిదేళ్ల కిందట శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని బంగారు కిరీటంతో అలంకరించాలని భక్తులు, నగర ప్రముఖులు భావించారు. అందుకు అప్పటి దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ధర్మకర్తలు, భక్తులు, ప్రముఖులు విరాళాల రూపంలో నగదు సేకరించాలని నిర్ణయించారు.
భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని వెంకన్నకు విరాళాలు వెల్లువలా వచ్చాయి. అతి తక్కువ వ్యవధిలోనే దాదాపు రూ.30 లక్షల వరకు సొమ్ము రావడంతో విజయవాడ వెళ్లి మింట్ ద్వారా 1.200 కేజీల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేశారు. ఈ బిస్కెట్లతోపాటు మిగిలిన లక్షలాది రూపాయల నగదును ఏలూరులో ఆంధ్రాబ్యాం కులో డిపాజిట్ చేశారు. ఆ తర్వాత కిరీటం పనులకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. కిరీటాన్ని చేయించే బాధ్యత తీసుకోవాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు ఇక్కడి అధికారులు పలుమార్లు లేఖలు రాసినా స్పందనా రాలేదు. ఇలా ఐదేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది.
బంగారంపై కన్ను
ఈ నేపథ్యంలోనే దేవాలయ మేనేజర్‌గా వచ్చిన తల్లాప్రగడ విశ్వేశ్వరరావు కన్ను బ్యాంకులో మూలుగుతున్న నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లపై పడింది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. వాస్తవానికి దేవాదాయ శాఖ రీజినల్ జారుుంట్ డెరైక్టర్, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఆభరణాల తనిఖీ అధికారి, నగర ప్రముఖులతో ఓ కమిటీ ఏర్పాటైంది. కిరీటం తయూరు చేరుుంచే పనులకు సంబంధిం చిన ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు మేనేజర్ విశ్వేశ్వరరావుకు సూచించారు. ఆయన ఇవేమీ పట్టించుకోకుండా, ఎవరి అనుమతులు తీసుకోకుండా నిబంధనలను పక్కనపెట్టి యుద్ధప్రాతిపదికన కిరీటం తయూరీ పనులు మొదలుపెట్టేశారు. భీమవరం మావుళ్లమ్మకు నగలు తయారు చేసే ఓ స్వర్ణకారుడికి ఈ కిరీటం తయారీ బాధ్యతను అప్పగించారు.
బిస్కెట్లను కరిగించగా వచ్చిన దాంట్లో 200 గ్రాముల బంగారాన్ని తనకు ఇవ్వాల్సిందిగా సదరు అధికారి స్వర్ణకారుడిని కోరినట్టు తెలుస్తోంది. అరుుతే, ఆ స్వర్ణకారుడు ‘దయచేసి ఇలాంటి పనులు చేయమని అడగొద్దు. దేవుడి సొమ్ము ముట్టుకోవాలంటే మాకు భయం’ అని కుండబద్దలుకొట్టినట్టు చెప్పడంతో అక్కడికి సరిపెట్టేసిన అధికారి లెక్కాపత్రం లేని నగదుపై పడ్డాడు. కిరీటానికి అవసరమైన వజ్రాల కొనుగోలు పేరిట బ్యాంకులోని మొత్తం నగదును డ్రా చేసి ఇష్టారాజ్యంగా ఖర్చుచేశారన్న ఆరోపణలను మూటకట్టుకున్నాడు. వజ్రాల కొనుగోళ్లలో దాదాపు సగం డబ్బు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఈ వజ్రాలు కూడా నాణ్యమైనవి కాదని సమాచారం.
అమెరికన్ డైమండ్లను పొదిగేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆనోటా ఈనోటా కిరీటం పనులపై పలురకాల వ్యాఖ్యలు, శాస్త్ర విరుద్ధంగా కిరీటం డిజైన్ తయరవుతోందన్న వాదనలు రావడంతో అప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి కిరీటం పనులకు ఎలాగోలా అనుమతి తీసుకున్నాడు. ఈ అనుమతుల విషయంలోనే తనకు చాలా డబ్బులు ఖర్చయ్యాయని, పైనుంచి కిందిస్థాయి అధికారుల వరకు చాలామందికి ముట్టజెప్పాల్సి వచ్చిం దంటూ వారి పేరిట కూడా ఆలయ మేనేజర్ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం మరింత ముదరకుండా కొన్నాళ్ల కిందట బ్రహ్మోత్సవాల సమయంలో హడావుడిగా స్వామివారికి కిరీటం అలంకరింపజేసి చేతులు దులిపేసుకున్నాడు.
బదిలీతో అవినీతి రూపుమాపుతారా?
స్వామివారి కిరీటధారణ జరిగి నెలలు గడుస్తున్నా దాని తయారీ వెనుక చోటుచేసుకున్న అక్రమాల వ్యవహారం ఇంకా తేలలేదు. కిరీటం తయూరీకి సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం కింద ఇటీవల కొందరు దరఖాస్తు చేయగా, విశ్వేశ్వరరావు రూ.30 వేలు ఖర్చుపెట్టి కోర్టుకెళ్లి మరీ స్టే తెచ్చుకున్నాడు. ఈ అధికారి నిర్వాకంతో తమకు ఎక్కడ ఏ మరక అంటుకుంటుందోనని భయపడిన ఉన్నతాధికారులు విశ్వేశ్వరరావును ఇటీవలే బదిలీ చేశారు. కేవలం బదిలీతోనే అతని అవినీతి రూపుమాపుతుందా.. భక్తులు స్వామివారికి ఇచ్చిన లక్షలాది రూపాయల మాటేమిటి.. ఆ సొమ్ము దేవుడి ఖజానాకు తిరిగి ఎలా జమవుతాయన్న ప్రశ్నలు భక్తుల నుంచి వస్తున్నాయి.