'రాజీనామా చేస్తానంటే నేనే వద్దన్నా'
హైదరాబాద్ : శాఖ మార్పు వ్యవహారంలో శ్రీధర్ బాబు రాజీనామా చేస్తానంటే తానే వద్దన్నానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీధర్ బాబు శాఖ మార్చటం అనైతికం, అప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జానారెడ్డి విమర్శించారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని జానా అన్నారు. ఈనెల 3వ తేదీన మినిస్టర్స్ క్వార్టర్స్లో సమావేశం కావాలని తెలంగాణ నేతలను జానారెడ్డి ఈ సందర్భంగా కోరారు. కాగా సీఎం వ్యవహారశైలిపై తెలంగాణ ప్రాంత మంత్రులు ఈరోజు రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు.