తెలంగాణ సీఎల్పీ నేతగా జానారెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత ఎంపిక రేసులో మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గెలిచారు. తెలంగాణ రాష్ట్రంతో తొలి ప్రతిపక్ష నేతగా జానారెడ్డి ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. మంగళవారం ఇక్కడ జరిగిన సీఎల్పీ భేటీలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ పరిశీలకులుగ వయలార్ రవి, రామచంద్ర కుంతియా సమక్షంలో సీఎల్పీ నేత ఎంపిక జరిగింది.
కాగా సీఎల్పీ నేత పదవి కోసం జానారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి పోటీ పడినప్పటికీ చివరికి జానారెడ్డినే ఆ పదవి వరించింది. సీనియర్లు అంతా జానారెడ్డికి మద్దతు ఇవ్వటంతో ఆయన ఎంపిక ఏకగ్రీవం అయ్యింది. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.
తెలంగాణ చరిత్రలో సోనియా పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆయన పేర్కొన్నారు. నేతలంతా సమిష్టిగా పని చేసి పార్టీకి పూర్వ వైభవం తెస్తామని జానారెడ్డి తెలిపారు. ఇక జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.