చేతులెత్తి దండం పెడుతున్నా.. | hareesh rao request to dk aruna and janareddy on projects stopped | Sakshi
Sakshi News home page

చేతులెత్తి దండం పెడుతున్నా..

Published Wed, Mar 22 2017 2:03 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

చేతులెత్తి దండం పెడుతున్నా..

చేతులెత్తి దండం పెడుతున్నా..

ప్రాజెక్టులకు అడ్డం పడొద్దు: కాంగ్రెస్‌కు హరీశ్‌ విన్నపం
జనం ఉసురు పోసుకోవద్దని వ్యాఖ్య
అక్రమ ప్రాజెక్టులకు గేట్లెత్తి హారతులిచ్చింది ఎవరో తెలుసంటూ విమర్శలు
గత వైఫల్యాలకు తమను బాధ్యులను చేయొద్దన్న జానారెడ్డి
తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులనే పూర్తి చేశారన్న డీకే అరుణ
సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ


సాక్షి, హైదరాబాద్‌: ‘‘దండం పెడుతున్నా.. మా మీద కోపం ఉంటే తిట్టండి.. కానీ ప్రాజెక్టులను మాత్రం దయచేసి అడ్డుకోవద్దు. జనం ఉసురు పోసుకోవద్దు. ఇక మీ దయ..’’ అంటూ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చేతులెత్తి కాంగ్రెస్‌ సభ్యులను వేడుకున్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు, సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటీ పూర్తి కాకపోవడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని మండిపడ్డారు. నందికొండ దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్‌ స్థలాన్ని మార్చడం మొదలు ప్రాజెక్టులను, చెరువులను పట్టించుకోకపోవడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టులకు, అనుమతుల్లేని ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి, మంగళ హారతులు ఇచ్చిన కాంగ్రెస్‌ సభ్యులు ఇప్పుడు కూడా అడుగడునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం శాసనసభలో నీటిపారుదల శాఖ పద్దుపై చర్చ అనంతరం హరీశ్‌  సమాధానం ఇచ్చారు.

నీటి లభ్యత లేనందునే ప్రాణహిత రీ డిజైన్‌
తమ్మిడిహెట్టి వద్ద సరైన నీటి లభ్యత లేని కారణంగానే ప్రాణహిత ప్రాజెక్టును రీ డిజైన్‌ చేశామని హరీశ్‌ తెలిపారు. నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ 2015లో చెప్పిందన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 270 టీఎంసీలు అనుకున్నామని... కానీ 165 టీఎంసీలే ఉన్నాయని సీడబ్ల్యూసీ పేర్కొందన్నారు. 152 మీటర్ల వరకు కడితే 120 టీఎంసీలు వస్తాయని.. 148 వద్ద కడితే 44 టీఎంసీలే లభ్యతగా ఉంటాయని చెప్పిందన్నారు. 2013లో అప్పటి మహారాష్ట్ర సీఎం సైతం ముంపును ఒప్పుకోమని చెప్పారన్నారు.

‘‘మల్లన్నసాగర్‌ను నిలుపుదల చేసేందుకు కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు చేసింది. సిరిసిల్లలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయిన మహేందర్‌రెడ్డి మల్లన్నసాగర్‌పై చనిపోయిన వ్యక్తుల పేర్లపై కేసులు వేశారు. రెండేళ్ల క్రితం చనిపోయిన రైతులు ఆత్మలుగా వచ్చి కాంగ్రెస్‌ తరపున కేసులు వేశాయా? కొల్హాపూర్‌లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. అడవి ఉందని... పులులు చనిపోతాయని చెప్పి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నారు. నిజానికి అక్కడ పులులు కాదు కదా పిల్లులు, తొండలు కూడా లేవు..’’ అని హరీశ్‌ అన్నారు.

మేం నీళ్లిచ్చింది వాస్తవం కాదా: జానా
మంత్రి హరీశ్‌ కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టడంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. తమ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల పనులే కొనసాగుతున్నాయని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదలు పెట్టిన పనులు ఒక్కటీ ముందుకు సాగడం లేదన్నారు. . ‘‘భీమా, నెట్టెంపాడులో మేం 70 శాతం నుంచి 80 శాతం నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? దేవాదుల కింద నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? గత వైఫల్యాలకు మమ్మల్ని బాధ్యులను చేసి మాట్లాడటం సరికాదు’’ అని ఆయన అన్నారు.

కొత్త ప్రాజెక్టులు ఏవీ?: డీకే అరుణ
కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులనే పూర్తి చేసి అంతా తామే చేశామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పడం హాస్యాస్పదమని  ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఈ ప్రభుత్వం రెండేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు కొత్తగా మొదలుపెట్టిందో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టులను 2012లోనే తామే పూర్తి చేశామని... అప్పుడే నీరిచ్చామన్నారు. అలాంటిది ఈ మంత్రి వచ్చి ఎలా ప్రారంభోత్సవం చేశారని ప్రశ్నించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement