- సీఎల్పీ నేతగా సమర్థంగా పని చేయడం లేదు: పాల్వాయి వ్యాఖ్యలు
- తప్పుకుంటానన్న జానారెడ్డి... వారించిన నేతలు
- మండలి నేతకు ఎన్నిక వద్దా?: సర్వే సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేతగా జానారెడ్డి సమర్థంగా పనిచేయడం లేదని, ఆయన స్థానంలో ఎమ్మెల్యే డి.కె.అరుణను నియమించడం మేలని టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. ‘‘మహిళ అయినా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే డి.కె.అరుణ ఒక్కరే గట్టిగా మాట్లాడుతున్నారు. జిల్లాలో కూడా ఏదో కార్యక్రమంతో ప్రజల్లోకి పోతున్నారు. అసెంబ్లీలోనూ ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడుతున్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు కోట్లు సంపాదించినవాళ్లు కూడా జేబులో నుంచి రూపాయి తీయడం లేదు. జానా స్థానంలో డి.కె.అరుణను పెడితే మంచిది’ అని పాల్వాయి వాదించారు. దాంతో, పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని జానా బదులిచ్చారు.
‘‘సోనియాగాంధీకి చెప్పి పదవిని వదులుకుంటా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో ఎవరినైనా పెట్టుకొమ్మని అధినేత్రికి చెబుతా. సామాన్య కార్యకర్తగా ఉంటూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తా’’ అని బదులిచ్చారు. భేటీలో పాల్గొన్న ఇతర నేతలు జానా నిర్ణయాన్ని వారించారు. శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత ఎన్నిక విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రస్తావించారు. షబ్బీర్ అలీని తాత్కాలిక ప్రాతిపదికనే నియమించామని గుర్తుచేశారు. ‘మండలి, శాసనసభాపక్షాలకు ఇప్పటిదాకా ఎన్నికలు నిర్వహించలేదు. వాటిని వెంటనే నిర్వహించాలి’ అని సర్వే కోరగా దిగ్విజయ్ అంగీకరించారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలపై శాస్త్రీయ అధ్యయనానికి పార్టీ తరపున రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శిక్షణ శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. రెండేళ్ల టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలు, దేశానికి కాంగ్రెస్ చేసిన సేవ, పార్టీ సిద్ధాంతాలు తదితరాలుసిలబస్‌గా ఉంటాయి. సోషల్ మీడియాను వినియోగించుకోవాలని కూడా భేటీ నిర్ణయించింది. దీనిపై 2 రోజుల్లో సమావేశమై నిర్దిష్ట బాధ్యతలను విభజించుకోవాలని నిర్ణయించారు.
టీఆర్‌ఎస్‌ను చీల్చే యత్నాలను అడ్డుకున్నా: జానా
టీఆర్‌ఎస్‌ను చీల్చడానికి గతంలో జరిగిన ప్రయత్నాలను తాను వారించానని సీఎల్పీ నాయకుడు జానారెడ్డి చెప్పారు. అసెంబ్లీలోనూ ఇదే విషయం చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడేమో తెలంగాణ రాష్ట్రం అనైతిక రాజకీయ ప్రలోభాలకు అడ్రస్‌గా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. అప్రజాస్వామిక, అనైతిక ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. ఏ పదవీ ఆశించకుండా, ఉన్న పదవిని త్యాగం చేసైనా కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని ప్రకటించారు.
జానా కంటే డీకే మేలు
Published Thu, Jun 16 2016 3:51 AM | Last Updated on Fri, Mar 22 2019 6:13 PM
Advertisement
Advertisement