హైదరాబాద్ : తనకెవరూ షోకాజ్ నోటీసులు పంపించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ...తాను ముక్కుసూటిగా వ్యవహరిస్తానని అన్నారు. జానారెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దిగ్విజయ్ సింగ్ తనను వివరణ అడిగినట్లు పాల్వాయి తెలిపారు. కాంగ్రెస్ లో ఉన్న కోవర్ట్లులు పార్టీని విడిచి పోవాలని, వారివల్లే కాంగ్రెస్ బలహీనపడుతోందన్నారు.
తానే పెద్ద ప్రతిపక్ష నాయకుడినని, కాంగ్రెస్తో తనకంటే పెద్ద అపోజిషన్ లీడర్ లేరని పాల్వాయి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కరువును ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఆయనవి అన్ని హిట్లర్ విధానాలు అని, నియంత పాలనలో ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కాగా అధికార టీఆర్‌ఎస్‌కు సీఎల్పీ నేత కె.జానారెడ్డి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.