‘టీఆర్ఎస్ కు జానారెడ్డి కోవర్టు’
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌కు సీఎల్పీ నేత కె.జానారెడ్డి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. జానారెడ్డి వంటి కోవర్టులు పార్టీలో చాలామంది ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాల్వాయి బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలోని కోవర్టుల గురించి సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి లేఖ రాసినట్టు చెప్పారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు ప్రక్షాళనకు సమయం వచ్చిందని, ఆయారాం గయారాంలను తప్పించడం ఖాయమని పేర్కొన్నారు.
నల్లగొండలో పార్టీ మూడు గ్రూపులుగా ఉందని, దుర్మార్గులు పార్టీని వీడితేనే లాభమని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి సోదరులు పార్టీ అండతో కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. మంత్రి హరీష్‌రావుతో మాట్లాడుతూ పనులు చేసుకుంటున్నారని ఆరోపించారు. తప్పుగా మాట్లాడినందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజు నోటీసు ఇచ్చారని, అధిష్టానం అనుమతితోనే షోకాజు ఇచ్చినట్టు తెలిపారు. దిగ్విజయ్‌ను తిట్టినా, జానారెడ్డి గురించి మాట్లాడినా పార్టీ బాగుకోసమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ కేడర్‌ను కాపాడుకోవడానికే తన కుమార్తె స్రవంతి గత ఎన్నికల్లో రెబెల్‌గా పోటీచేశారని చెప్పారు. సుఖేందర్‌రెడ్డి, భాస్కర్‌రావు పార్టీని వీడితే కాంగ్రెస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని పాల్వాయి స్పష్టంచేశారు.