సీఎల్పీ పదవికి ఓటింగ్ ?
* ప్రతిపక్ష నేత హోదాలో కేబినెట్ ర్యాంకు లభించనుండడంతో తీవ్ర పోటీ
* రేసులో జానారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
* నేటి భేటీలో ఖరారుచేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రతిపక్ష నేత ఎవరనేది కొద్ది గంటల్లో తేలనుంది. మంగళవారం ఉదయం 10.30కు జరిగే కాం గ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేత పేరు ఖరారుకానుంది. అయితే ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ మంత్రి హోదా ఉండడం తో సీఎల్పీ పదవికి తీవ్రంగా పోటీ నెలకొంది. దీనికితోడు ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో... ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరుగనున్న సీఎల్పీ భేటీకి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ పరిశీలకులుగా వయలార్ రవి, రామచంద్ర కుంతియా హాజరుకానున్నారు. సీఎల్పీ నేత పదవి కోసం జానారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం జానారెడ్డి, ఉత్తమ్, డీకే అరుణ మధ్యే నెలకొంది. కాంగ్రెస్‌కు మొత్తం 21 మంది ఎమ్మెల్యేలుండగా వారిలో సీనియర్లు జానారెడ్డికి మద్దతిస్తున్నారు. జూనియర్ ఎమ్మెల్యేలు మాత్రం డీకే అరుణకు బాసటగా నిలుస్తున్నారు. సీనియర్లు తమకంటే జూనియర్ అయిన అరుణ పేరును ప్రతిపాదించేందుకు ససేమిరా అంటున్నారు.
ఓటింగ్ ఖాయం..!
ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, జానారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముగ్గురూ సీఎల్పీ నేత పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో ఓటింగ్ నిర్వహించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి గతంలో సీఎల్పీ నేత పదవికి ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధినేత్రికి కట్టబెడుతూ తీర్మానం చేసేవారు. అంతిమంగా హైకమాండ్ పెద్దలే సీఎల్పీ నేతను ఎంపిక చేసేవారు. ఈ సారి మాత్రం హైకమాండ్ పెద్దల ఆలోచనలో మార్పు వచ్చింది. ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రాకపోతే ఓటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం కూడా సీఎల్పీ నేతపై ఏకాభిప్రాయం రాకపోతే ఓటింగ్ నిర్వహించి సిద్ధరామయ్యను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ సారి కూడా ఓటింగ్ నిర్వహిస్తామని హైకమాండ్ పెద్దలు కాంగ్రెస్ నేతలకు సంకేతాలు పంపారు. కాగా, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎంపిక కోసం ఎమ్మెల్సీలతో కూడా దిగ్విజయ్, వయలార్ రవి సమావేశం కానున్నారు.