టంగుటూరి శ్రీనివాస రావు
గుంటూరు: నైజీరియాలో కిడ్నాప్కు గురైన తెలుగు యువకుడు శ్రీనివాస రావు విడుదలయ్యారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామానికి చెందిన టంగుటూరి శ్రీనివాస రావుని కొందరు దుండగులు 24 రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి తాను విడుదలైనట్లు చింతలపూడిలోని కుటుంబ సభ్యులకు అతను ఫోన్ చేసి చెప్పారు. కుమారుడు విడుదలయ్యాడని తెలిసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టంగుటూరి శేషయ్య, నాగమణి దంపతుల కుమారుడైన శ్రీనివాసరావు ఎంబీఏ పూర్తి చేశాడు. రెండున్నరేళ్లుగా నైజీరియాలోని మెరిట్ నైజీరియా లిమిటెడ్‌కు చెందిన లెగసీ అనే నిర్మాణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరు పట్టణానికి చెందిన ఓ యువతితో అక్టోబర్ 7న అతనికి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీనివాసరావు అక్టోబరు 30న తిరిగి నైజీరియా వె ళ్లాడు. అతనితోపాటు మరో ఇద్దరు పాకిస్తానీయులు ఒకే గదిలో ఉంటున్నారు.
నవంబరు 26 రాత్రి ఇంటిలో ఉండగా కొందరు ఆ ముగ్గురిని కిడ్నాప్ చేశారు. స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పాకిస్తానీయుల కోసం వచ్చిన ఆగంతకులు వారితో ఉంటున్న శ్రీనివాసరావును కూడా పొరపాటున తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.