భక్తాగ్రేసుడిపై శ్రీరామచంద్రమూర్తి
సాక్షి, తిరుమల: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శనివారం హనుమంత వాహనం ఊరేగింపు వైభవంగా సాగింది. రాత్రి ఏడు గంటల నుంచి 8.30 గంటల వరకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుడి రూపంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవదేవుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు.
అనంతరం రాత్రి 10 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థాన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని రంగనాయక మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం వసంతోత్సవాన్ని రద్దు చేశారు.