
శ్రీవారి సేవకు పునరంకితమవుతా
తిరుపతి: శ్రీవారి సేవకు తాను పునరంకితమవుతానని తిరుమల ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల ఒకటవ తేదీన ఆయన గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. స్విమ్స్‌లో చికిత్స అనంతరం ఆయనను చెన్నై ఆపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది ఆరోగ్యం మెరుగుపడడంతో సోమవారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి సరోజినీదేవి రోడ్‌లోని స్వగృహానికి చేరుకున్నారు.
ఆయన తోబుట్టువులు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. శేషాద్రి వెంట చెన్నై నుంచి టీటీడీ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డివారి ప్రభాకర్‌రెడ్డి, సుబ్రమణ్యయాదవ్ (పరదాల మణి) వచ్చా రు.. సంపూర్ణ ఆరోగ్యంతో స్వగృహానికి చేరుకున్న శేషాద్రిని ‘సాక్షి’పలకరించింది. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన మనోభావాలు..
బాగా విశ్రాంతి పొంది వచ్చాను. ప్రస్తుతం కులాసాగానే ఉన్నాను. ఇక విశ్రాంతి అవసరం లేదు. బుధవారం నుంచి శ్రీవారి సేవకు పునరంకితం అవుతా. స్వామి నాకు పునర్జన్మ ప్రసాదించాడు. మునుపటి కంటే ఉత్సాహంగా స్వామి సేవలో పాల్గొంటా.
సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి శ్రీవారి గరుడసేవలో ఎప్పటిలాగే పాల్గొన్నా. మరుసటి రోజు ఉదయం హనుమంత వాహన సేవలో ఉండగా ఆయాసం వచ్చింది. 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని కాసేపు కూర్చున్నా. అయినా తగ్గలేదు. అశ్వని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. స్విమ్స్‌లో చేర్పించిన తర్వాత మరుసటి రోజు కొంత తేరుకున్నా. 3వ తేదీ ఉదయం వచ్చిన వాళ్లతో మాట్లాడగలిగాను.
తిరుమలలో జేఈవో, ఆలయ డెప్యూటీ ఈవో, పేష్కార్ సహకారం బాగుంది. నేను అస్వస్థతకు గురైంది మొదలు క్షేమంగా ఇంటికి చేరేంత వరకు వారందరూ నా ఆరోగ్యం కోసం పరితపించారు. శేషాద్రి ఓఎస్‌డీ పదవీ కాలాన్ని పొడిగించినందుకు ఎవైరె నా బాధపడి ఉంటే నేనేమి చేయగలను? శ్రీవారిని సేవించే అవకాశం మళ్లీ ఎందుకు కల్పించారో వారు ఆ స్వామినే అడగాలి.
శేషాద్రి కంట కన్నీరు
చెన్నై నుంచి ఇంటికి చేరుకున్న శేషాద్రి తనను ఎక్కువగా అభిమానించే తోబుట్టువులు ఆప్యాయంగా తల నిమిరి పలకరించే సరికి దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. కంట తడి పెట్టారు. స్వామి దయ వల్ల క్షేమంగా తిరిగి వచ్చానని వారిని ఓదార్చారు.