
స్టాఫ్ నర్సు ఆత్మహత్యాయత్నం
విజయనగరం క్రైం : జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రభుత్వ స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న ఎం.ఆశాలత బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల మండలం బోనాల గ్రామానికి చెందిన కొరిమిగుంట్ల బాబు ఆచారి పదేళ్ల క్రితం విశాఖపట్నానికి చెందిన స్టాఫ్‌నర్సు ఎం.ఆశాలతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం ఆశాలత జిల్లా కేంద్రాస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా చేరారు. వీరు కేంద్రాస్ప త్రి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. పులివెందులకు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవాలని బాబు ఆచారి ఆశాలతకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇదే విషయమై కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఆశాలత విధులు ముగించుకుని ఇంటికి వచ్చింది. అనంతరం ఇంటికి వచ్చిన బాబుఆచారి ట్రాన్‌సఫర్ విషయమై ఆశాలతతో మళ్లీ గొడవ పడినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఆశాలత బెడ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని నిద్రమాత్రలు మింగి చున్నీతో ఫ్యాన్‌కు ఉరిపోసుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే బాబు ఆచారి తలుపును తోసి బెడ్ రూమ్‌లోకి వెళ్లి కేకలు పెట్టాడు. స్థానికుల సహాయంతో ఆశాలతను ద్విచక్ర వాహనంపై జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆశాజ్యోతి అపస్మారక స్థితిలో ఉంది. ఆశాలత స్పృహలోకి వస్తేగానీ పూర్తి వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు. అవుట్ పోస్టు పోలీసులు భర్త వాంగ్మూలాన్ని నమోదు చేశారు.