సై.. రూలింగ్ x రెబల్స్
సాక్షిప్రతినిధి, అనంతపురం : అధికారపార్టీకి... ప్రతిపక్షపార్టీకి ఎన్నికలు జరగడం సహజం. అయితే ‘అనంత’ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికారపార్టీకి చెందిన అభ్యర్థులే పరస్పరం తలపడుతున్నారు. స్టాండింగ్ కమిటీలో మేయర్ కాకుండా తక్కిన ఐదుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 9మంది అభ్యర్థులు ఉన్నారు. మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మద్దతుతో రహమత్‌బీ, రంగాచారి, రాజారావు, సుజాతమ్మ, సరళ బరిలో ఉన్నారు. వీరికి పోటీగా టీడీపీ నేత జయరాం నాయుడు వర్గం తరఫున ఉమామహేశ్వర్ , హరిత , విద్యాసాగర్, లాలూ, ధనలక్ష్మి నామినేషన్లు వేశారు. అయితే చివరి నిమిషంలో ధనలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వర్గం నుంచి ఐదుగురు, జయరాం వర్గం నుంచి నలుగురు బరిలో నిలిచారు.
ఎవరి లెక్కలు వారివి:
ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని భావించిన ఎమ్మెల్యే స్వపార్టీ వారే పోటీగా నామినేషన్లు వేయడంతో అవాక్కయ్యారు. ఒకట్రొండుస్థానాలు ఓడినా నగరపార్టీలో బలం తగ్గడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. అయితే 3 స్థానాలు మాత్రమే కచ్చితంగా గెలుస్తామని రెండు స్థానాలు జయరాం నాయుడు గెలిచే అవకాశం ఉందని ఓ అంచనాకు వచ్చినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. అయితే జయరాం నాయుడు భార్య హరిత తప్పనిసరిగా గెలుస్తుందని, తక్కిన నాలుగు మాత్రం పోనివ్వకూడదని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం కార్పొరేటర్లను విడివిడిగా పిలిపించుకుని మాట్లాడారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన జయరాం ఎలాగైనా ఎన్నికల్లో కనీసం 3స్థానాలు గెలిచి సత్తా చాటాలనే యోచనలో ఉన్నారు. కార్పొరేటర్లందరినీ జయరాం కూడా స్వయంగా కలిసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. మేయర్, ఎమ్మెల్యే తరఫున నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజారావు మినహా ఎవ్వరూ పార్టీఉన్నతి కోసం పని చేయలేదని, అలాంటి వారితో నామినేషన్లు వేయించినందుకే తాము రెబల్‌గా బరిలోకి దిగాల్సి వస్తోందని కార్పొరేటర్లకు వివరిస్తున్నారు. పార్టీ ఉన్నతికి శ్రమించిందెవరు.. చివరలో పార్టీలో చేరి పదవులు అనుభవిస్తున్న వారెవరో తెలుసుకుని ఓటేయాలని జయరాం చెబుతున్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: నాగవేణి, కమిషనర్
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రశాంతంగా నిర్వహిస్తాం. ఓటింగ్‌హాలులో మేయర్ ఉండేందుకు వీల్లేదు. ఉదయం 11 నుంచి ఒంటి గంటవరకూ ఓటింగ్ జరగనుంది. నాలుగు గంటలకు కౌంటింగ్ జరిపి వెంటనే ఫలితాలు ప్రకటిస్తాం.
ఐదుస్థానాలు గెలుస్తాం: స్వరూప, మేయర్
ఐదుస్థానాలు కచ్చితంగా గెలుస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ కార్పొరేటర్లు మావైపే ఉంటారనే నమ్మకం ఉంది.
మూడుస్థానాలు మావే: జయరాంనాయుడు.
నాలుగుస్థానాల్లో 3 స్థానాలు కచ్చితంగా గెలుస్తాం. నాలుగోస్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. పార్టీ కోసం శ్రమించినవారిని కాకుండా తనకు అనుకూలమైన వ్యక్తులకు పదవులు కట్టబెట్టుకుని నిజమైన కార్యకర్తలకు ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారు. దీనిపైనే మా పోరాటం! దీనికి కార్పొరేటర్ల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం.
ఎన్నికల ప్రక్రియ ఇలా:
స్టాండింగ్ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇందులో మేయర్ చైర్మన్‌గా ఉంటారు. తక్కిన ఐదుస్థానాలకు ఓటింగ్ జరగనుంది. కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 32 టీడీపీ, 11వైఎస్సార్‌సీపీ, 4 స్వతంత్ర, 2 సీపీఐ, ఓ స్థానంలో సీపీఎం అభ్యర్థులు ప్రాథినిద్యం వహిస్తున్నారు. వీరిలో 14మంది టీడీపీ అభ్యర్థులు జయరాంనాయుడు వర్గం వైపు, 18మంది ఎమ్మెల్యే వర్గంవైపు ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఇరువర్గాలకు ఇద్దరు చొప్పున ఓటేసే అవకాశం ఉంది. సీపీఐ, సీపీఎం అభ్యర్థులు ఎవరికి ఓటేస్తారనేది ఇంకా తేలలేదు. వైఎస్సార్‌సీపీ సభ్యులు బాయ్‌కాట్ చేస్తారని మొదట అనుకున్నా ఓటింగ్‌లో పాల్గొంటారనే విషయంలో మాత్రం స్పష్టత వచ్చింది.