కడప సెవెన్‌రోడ్స్ : కడప విమానాశ్రయాన్ని మే 10 నుంచి 15వ తేదీలోపు ప్రారంభిస్తామని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దక్షిణ ప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరసింహమూర్తి వెల్లడించారు. ఇందుకు జిల్లా యంత్రాంగం నుంచి కొంత సహాయ సహకారాలు అవసరమవుతాయన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన కలెక్టర్ కేవీ రమణతో చర్చలు జరిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవానికి పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారని తెలిపారు.
కడప విమానాయాశ్రయం నుంచి బెంగ ళూరుకు సర్వీసు నడపడానికి ఎయిర్ పిగాసుస్ విమానయాన సంస్థ తమ సమ్మతిని తెలిపిందని పేర్కొన్నారు. విమానాశ్రయం లోపలి భాగంలో జింకల బెడద నివారణ, పొదల తొలగింపు చర్యలు తీసుకోవాల్సి ఉందని కలెక్టర్‌ను కోరారు. అగ్నిమాపకశాఖ నుంచి ఎన్‌ఓసీ జారీ కావాల్సి ఉందన్నారు. కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
అనంతరం కలెక్టర్, విమానాశ్రయ అధికారులు, కడప డీఎఫ్‌ఓ మొహిద్దీన్, నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మల్లికార్జున విమానాశ్రయంలో పర్యటించారు. విమానాశ్రయ అధికారులు కోరిన విధంగా లోపలి భాగంలో పొదలను కొంతమేరకు వెంటనే తొలగించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును కలెక్టర్ ఆదేశించారు.
అలాగే జింకల నివారణ బెడదకు చర్యలు చేపట్టాలని డీఎఫ్‌ఓకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ జీఎం సిల్విస్టర్ ఇజ్రాయిల్, దక్షిణ ప్రాంత జనరల్ మేనేజర్ గోపాల్, కడప ఎయిర్‌పోర్టు డెరైక్టర్ శ్రీనివాసన్, ఏజీఎంలు వెంకటా చలపతి, శేషయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
త్వరలో విమానాశ్రయం ప్రారంభం
Published Fri, May 1 2015 5:35 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement
Advertisement