కౌలు కుదేలు
కౌలు రైతుల కష్టాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సర్కార్ నిర్లక్ష్యంతో వేలాది మంది దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. భూముల్ని కౌలుకు తీసుకుని జిల్లాలో 1.50 లక్షలకుపైగా కౌలు రైతులు దాదాపు ఐదు లక్షల హెక్టార్లలో సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భూ యజమానుల నుంచి రక్షణ కల్పిస్తామన్న పాలకుల మాటలు హామీలకే పరిమితమవడంతో వీరి బతుకుల్లో మార్పు కనిపించడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఎప్పటిలాగే పెట్టుబడి కోసం నానాతంటాలు పడుతున్నారు.
- బ్యాంకర్ల నిర్లక్ష్యంతో ప్రైవేట్ వ్యాపారులే దిక్కు
- ప్రారంభమైన ఖరీఫ్ సీజన్
- సర్కార్ కుట్రల చట్రంలో కౌలు రైతు
రెవెన్యూ ఇలా చేయాలి... మండలాల్లో గుర్తించిన కౌలు రైతుల జాబితాను సంబంధిత బ్యాంకులకు అందజేయాలి. గుర్తించిన కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించాలి. రుణాలు మంజూరు చేసే వరకూ వెంటపడాలి. ఎప్పటికప్పుడు బ్యాంకర్లతో సంప్రదించి రుణాలు మంజూరు చేశారా లేదా పర్యవేక్షించాలి. రుణం ఇవ్వకపోతే కారణం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రుణాలు మంజూరు చేయాలి. జూన్ నెల అయిపోయి జూలై ప్రారంభమైనా రుణాలు మంజూరులో కాలయాపన చోటుచేసుకుంటోంది.
హడావుడికే పరిమితం...
గత ఏడాది ఈ కార్డుల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం చేసిన సర్కార్ ఈ ఏడాది కొంచెం ముందుగానే స్పందించి గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మే 11 నుంచి 22 వరకు గ్రామ సభలు నిర్వహణ, 23 నుంచి 28 వరకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయడం, 30వ తేదీ నుంచి బ్యాంకర్లకు జాబితాను పంపాలని ప్రణాళిక రూపొందించారు. మండలాల్లో ఉప తహశీల్దార్లకు గ్రామ సభల షెడ్యుల్‌ను ఉన్నతాధికారులు జారీ చేశారు. మొత్తం 56 మండలాల్లో 1056 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గ్రామ సభల్లో 16,323 మంది కౌలు రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్నిచోట్ల గ్రామ సభలు నిర్వహించకుండానే స్థానిక వీఆర్‌వోలు తమకు తెలిసిన ఒకరిద్దరినుంచి దరఖాస్తులు తీసుకొని చేతులు దులుపుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో అధికారులు పరిశీలించి 13,996 మందికి రుణఅర్హత కార్డులు మంజూరు చేశారు. 1299 మంది పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించారు. 1025 మంది దరఖాస్తులను విచారిస్తున్నారు.
రుణమాఫీ చిక్కులు...
గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం రెండో ఏడాది వచ్చినా నేటికీ మోక్షం కలగలేదు.గత మూడు సంవత్సరాలలో జాయింట్ లయబులిటీ ద్వారా 1246 గ్రూపుల ద్వారా దాదాపు ఆరు వేల మంది లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలిచ్చాయి. చంద్రబాబు రుణమాఫీ ప్రకటనతో రైతులు బ్యాంకు రుణాలు చెల్లించలేదు. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా రైతుల పరిస్థితి తయారైంది. బ్యాంకులు ముందుకు రాకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి ఎదురవుతోంది. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ కింద రుణాలు మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాథ్ డిమాండ్ చేస్తున్నారు.