జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్టు సిబ్బంది పండగపూట పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. సంక్రాంతి పూట కొత్త దుస్తులు కాదు కదా.
ఐదు నెలలుగా జీతాలకు నోచుకోని
ఆరోగ్యశాఖ కాంట్రాక్టు సిబ్బంది
బడ్జెట్ ఉన్నా నిధులు విడుదల చేయని అధికారులు
విశాఖపట్నం : జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్టు సిబ్బంది పండగపూట పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. సంక్రాంతి పూట కొత్త దుస్తులు కాదు కదా.. కనీసం పిల్లలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేక అల్లాడిపోతున్నారు. దసరా, దీపావళి పండుగలకు సైతం అఫ్పుచేసి గడిపామని, సంక్రాంతికీ అదే దుస్థితి అని జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లా అంతటా వివిధ కేడర్లలో 320 మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. జిల్లాలో 280 మంది హెల్త్‌అసిస్టెంట్లు, 29 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, 20మంది ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారు. వీరికి థర్డ్ క్వార్టర్ జీతాల బడ్జెట్ ఇంతవరకు విడుదలకాకపోవడంతో ఏజెన్సీలో ఐదు నెలలుగా, జిల్లాలో మూడు నెలలుగా జీతాలందక ఆకలితో అలమటిస్తున్నారు. ఐదు రూపాయల వడ్డీకి అప్పులు చేసి మరీ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.
చింతపల్లి ట్రెజరీలో ఇటీవల వెలుగుచూసిన కుంభకోణంతో జీతభత్యాల చెల్లింపులు నిలిపివేశారు. లేని అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఉన్నట్టుగా రికార్డులు సృష్టించి ఏకంగా రూ.3.8కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను అధికారులు స్వాహా చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. దీంతో జీతాల బడ్జెట్ ఉన్నా బకాయిలు విడుదలకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే ఏజెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆగస్టు,సెప్టెంబరు జీతాలు చెల్లించ కుండా నిలిపివేశారు. దీనిని వారం రోజులకిందట ఎన్జీవో సంఘం నాయకులు జిల్లా ట్రెజరీ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. జీతాలూ చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ట్రెజరీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో ప్రతి సారి జీతాలు చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఎంత బడ్జెట్ విడుదల చేశారు, ఎంత ఖర్చు చేశారు, ఉద్యోగుల వివరాలు సకాలంలో డైరక్టరేట్‌కు పంపాల్సి ఉంది. ఆ వివరాలు సరిగా లేకుంటే బడ్జెట్ విడుదలలో జాప్యం జరుగుతోందని ఎన్జీవో సంఘం నాయకుల సమాచారం. ఇంతవరకు బడ్జెట్ విడుదల కాకపోవడంతో బడ్జట్ రిక్వైర్‌మెంట్ డైరక్టరేట్‌కు పంపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా ట్రెజరీ అధికారి వద్ద ప్రస్తావించగా బడ్జెట్ ఉందని.. కానీ డీఎంహెచ్‌వో నుంచి గ్రీన్‌సిగ్నల్ లేనందున నిలిచిపోయి ఉంటాయని చెబుతున్నారు.
కొంతమంది అవినీతి అధికారులు చేసిన చర్యలకు తాము ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంట్రాక్టు సిబ్బంది వాపోతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలే తప్ప జీతభత్యాలను ఆపేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.