బీజేపీపై ఒత్తిడి పెంచి విభజనను అడ్డుకోవచ్చు
Published Sun, Sep 15 2013 3:11 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
తణుకు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే విభజన ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందని, సమైక్యవాదులు ఆ పార్టీపై ఈమేరకు ఒత్తిడి తీసుకురావటం ద్వారానే అది సాధ్యమవుతుందని సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు అన్నారు. శనివారం ఆయన తణుకులో విలేకరులతో మాట్లాడారు. 42 పార్లమెంటు స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఏమాత్రం మద్దతు లేకుండా నరేంద్ర మోడి 2014లో ఎలా ప్రధాని కాగలరో ఆ పార్టీ నాయకులు, కొత్తనాయకత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రాంతాలు సంతోషంగా ఉంటేనే బిల్లును ఆమోదిస్తామని బీజేపీ చెప్పటంద్వారా విభజన ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. తెలంగాణ విభజనకు బీజేపీ మొగ్గుచూపినా పోత్తులు లేకుండా ఆ పార్టీకి రాష్ట్రంలో కలిసోచ్చే అంశమేమి లేదన్నారు.
తాగునీటి ఇక్కట్లు నిత్యకృత్యం
రాష్ట్రం రెండుగా విడిపోతే గోదావరి జిల్లాలు ఎడారిగా మారుతాయని పెంటపాటి పుల్లారావు ఆందోళన వ్యక్తం చేశారు. 854 కిలోమీటర్లు గల గోదావరి మన ప్రాంతానికి వచ్చేసరికి 40 కిలో మీటర్ల మేరే ప్రవహిస్తోందన్నారు. ఇక్కడ గోదావరికి అదనంగా నీరుతెచ్చే ఉపనదులు ఏమీ లేనందున, జలాలు స్టోరేజి చేసే సదుపాయాలు లేకపోవటంతో ఈ ప్రాంతం మొత్తం ఎడారిగా మారిపోతుందన్నారు. 1948 వరకు కలిసున్న భద్రాచలం ప్రాంతాన్ని 1960లో ఖమ్మంలో కలిపారని దీనివల్ల 30కిలో మీటర్లు పరిధిలోని గోదావరిని కోల్పోయామన్నారు. తెలంగాణ విభజన జరిగితే చుక్కనీరుకూడా మనకు రాదని అందువల్ల తాగునీటి ఇక్కట్లు గోదావరి వాసులకు నిత్యకృత్యమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల ఉద్యమంగా సాగుతున్నదని దీనికి అన్నివర్గాలు సహకరించి ఉధృతం చేయటంద్వారానే విభజన ప్రక్రియ నిలుస్తుందని తెలిపారు. సమావేశంలో వంటెద్దు సోమసుందర్రావు, రాజా, గట్టెం మాణిక్యాలరావు పాల్గొన్నారు.
Advertisement