సంక్రాంతి పీఆర్సీ తెచ్చేనా? | State Government employees PRC | Sakshi
Sakshi News home page

సంక్రాంతి పీఆర్సీ తెచ్చేనా?

Published Mon, Dec 29 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

సంక్రాంతి పీఆర్సీ తెచ్చేనా?

సంక్రాంతి పీఆర్సీ తెచ్చేనా?

♦ ఎదురు చూస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. పట్టించుకోని సర్కారు
♦ ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించని మంత్రివర్గ ఉప సంఘం

సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ కానుకగానైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీని ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం తీరు చూస్తుంటే వారి ఆశలు నిజమయ్యేట్లు కనిపించడంలేదు. గత ఏడాది జూలై నుంచే అమలు కావాల్సిన పదో పీఆర్సీ.. నివేదిక సమర్పణలో జాప్యం, రాష్ట్ర విభజన కారణంగా ఆలస్యమైంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీని అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఉద్యోగులను పట్టించుకోలేదు.

టీడీపీ సర్కారు 10 నెలలకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాత్రం పీఆర్సీ అమలుకు రూ.3,111 కోట్లు కేటాయించినట్లు  ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తున్నప్పటికీ, పీఆర్సీ అమలుపై ఏపీ ప్రభుత్వంలో కదలిక లేదు. దీనిపై ఏర్పాటయిన మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవలేదు.  ఇప్పటికీ నివేదికను ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చర్చలను జాప్యం చేస్తోందనే ఆందోళన నెలకొంది.
 
సిఫార్సుల్లోని ముఖ్యాంశాలు,డిమాండ్లు
...
కనీస వేతనం రూ. 13 వేలు. గరిష్టం రూ. 1.10 లక్షలు ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు. ఉద్యోగ సంఘాలు మాత్రం కనీస వేతనం రూ. 15 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఫిట్‌మెంట్ 29 శాతం ఇవ్వాలని సిఫార్సు చేయగా, కనీసం 69 శాతం ఇవ్వాలని యూని యన్లు కోరుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం డీఏ ఒక శాతం పెంచితే రాష్ట్రంలో 0.524 శాతం పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. డీఏ ప్రస్తుతం 0.856 శాతం ఉంది. అందువల్ల తాజా సిఫార్సు ఉద్యోగులకు నష్టమేనని సంఘాలు అంటున్నాయి.
ఇంటి అద్దె భత్యం ప్రస్తుతం గరిష్టంగా రూ. 12 వేలు ఉంది. దీన్ని రూ. 20 వేలకు పెంచాలన్నది పీఆర్సీ సిఫార్సు. జంట నగరాల్లో 30 శాతం, కార్పొరేషన్లలో 20 శాతం, మున్సిపాలిటీల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం అద్దె భత్యం చెల్లించాలని పేర్కొంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటి అద్దె భత్యాన్ని 25 శాతం ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి.
సీసీఏ గరిష్ట పరిమితిని రూ. 700 నుంచి రూ. 1,000కి పెంచాలని పీఆర్సీ పేర్కొంది.
ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ప్రకారం ప్రతి ఆరేళ్లకు ఒక ప్రమోషన్ ఇచ్చే విధానాన్నే కొనసాగించాలని పీఆర్సీ సూచించింది. కనీసం 5ఏళ్లకు  ఉండాలని సంఘాలు కోరుతున్నాయి.
పదవీ విరమణ సమయంలో చెల్లించే గ్రాట్యుటీని రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచాలని పీఆర్సీ పేర్కొంది. కమ్యుటేషన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న 40 శాతాన్నే కొనసాగించాలని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే పూర్తి పెన్షన్ (ఆఖరు నెల జీతంలో సగం)కు అర్హత లభిస్తుంది. దీనికి 5ఏళ్ల వెయిటేజి ఉంది. దీనివల్ల 28ఏళ్లు పని చేసిన వారికీ పూర్తి పెన్షన్ వస్తుంది. దీన్ని 8 ఏళ్లకు పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. దీనివల్ల 25 ఏళ్ల సర్వీసు ఉంటే పూర్తి పెన్షన్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం 20 ఏళ్ల సర్వీసుకే పూర్తి పెన్షన్  ఇస్తోందని, ఇదే విధానం ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ప్రస్తుతం పెన్షనర్ల వయసు 75 ఏళ్లు దాటితే 15 శాతం అదనపు పింఛన్ చెల్లిస్తున్నారు. దీన్ని 70 ఏళ్లకు తగ్గించాలని పీఆర్సీ సూచించింది. 90 ఏళ్లు దాటితే 100 శాతం అదనపు పింఛన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది.
 హాకేంద్రం తరహాలో 18 సంవత్సరాల లోపు పిల్లలున్న మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పిల్లల సంరక్షణ సెలవు ఇవ్వాలని సిఫార్సు చేసింది.
 
వెంటనే పీఆర్సీ అమలు చేయాలి
పీఆర్సీ సకాలంలో అమలు కాక ఉద్యోగులు ఇప్పటికే ఏడాదిన్నర సమయాన్ని కోల్పోయారు. వేతన సవరణ కమిషన్‌ను సకాలంలో ఏర్పాటు చేయించుకోవడంలో  సఫలమైనా, దాన్ని అమలు చేయించుకోవడంలో విఫలమయ్యాం. మండుతున్న ధరలు ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందువల్ల సంక్రాంతిలోగా ప్రభుత్వం పదో పీఆర్సీని అమలు చేయాలి.
- ఎస్టీయూ అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధీర్‌బాబు
 
నూతన సంవత్సర కానుకగా ప్రకటించాలి
పదో పీఆర్సీ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు ప్రారంభించాలి. నూతన సంవత్సర కానుకగా ప్రకటించాలి.
- పీఆర్టీయూ అధ్యక్షుడు కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి బి. అప్పారావు
 
 
మూల వేతనపు శ్రేణులు అమలు ఇలా..
కనీస వేతనం రూ. 13 వేల (ఇది మూల వేతనం) నుంచి ప్రారంభం కానుంది. రూ. 13 వేలు తొలి జీతం తీసుకున్న ఏడాదికి రూ. 390 ఇంక్రిమెంట్ కలుస్తుంది. మూడేళ్లకు మూల వేతనం రూ. 14,170 కు చేరిన తర్వాత ఏటా రూ. 430 కలుస్తుంది. రూ. 15,460 మూలవేతనం తర్వాత వార్షిక ఇంక్రిమెంట్ రూ. 470 ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ప్రకారం.. ప్రతి 6 సంవత్సరాలకు ఒక ప్రమోషన్ తప్పనిసరి. నిర్ణీత మూల వేతనపు శ్రేణిలో ఆరేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత తదుపరి శ్రేణి (స్కేల్) ప్రారంభమవుతుంది.
 1. 13,000-390-14170-430-15460-470-..
 2. 16,870-510-18,400-550-20,050-590-..
 3. 21,820-640-23,740-700-25,840-760-..
 4. 28,120-820-30,580-880-33,220-990-..
 5. 36,070-1,030-39,160-1,110-42,490-1190-..
 6. 46,060-1,270-49,870-1,360-53,950-1,460-..
 7. 58,330-1,560-63,010-1,060-67,990-1,760-..
 8. 73,290-1,880-78,910-2,020-84,970-2,160-..
 9. 91,450-2,330-98,440-2,515-1,08,500
 10. 1,00,770-2,520-1,10,850..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement