సంక్రాంతికి పీఆర్సీ కలేనా? | PRC doubtable to approval before Sankranti ? | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి పీఆర్సీ కలేనా?

Published Tue, Jan 6 2015 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

సంక్రాంతికి పీఆర్సీ కలేనా?

సంక్రాంతికి పీఆర్సీ కలేనా?

* పండుగ ముందు రోజు ఉద్యోగ సంఘాలతో చర్చలు
* సర్కారు జాప్యం వ్యూహాత్మకమే
* ఉద్యోగుల్లో అనుమానాలు
* పీఆర్సీ పూర్తి నివేదిక విడుదల

 
 సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి పీఆర్సీ ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీ అమలును జాప్యం చేయడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ సంఘాలకు పాక్షిక నివేదిక ఇచ్చి ఉంటుందనే చర్చ జరుగుతోంది. సోమవారం ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అనంతరం పీఆర్సీ పూర్తి నివేదిక (5 వాల్యూములు)ను ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దీనిపై ఒకటి రెండు రోజుల వ్యవధిలో చర్చలు జరపడానికి అవకాశం ఉన్నా.. మంత్రులు తీరిక లేకుండా ఉన్నారనే సాకుతో సంక్రాంతికి ముందు రోజున చర్చలు జరపాలని నిర్ణయించారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. 13వ తేదీన చర్చలు జరిపి అదే రోజున పీఆర్సీ అమలును ప్రకటించడం సాధ్యమయ్యే పని కాదని అధికారులు అంటున్నారు. ఫిట్‌మెంట్, ఇతర అంశాలను ముఖ్యమంత్రి ఆమోదం తర్వాతే ప్రకటించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి పీఆర్సీ కలగానే కనిపిస్తోందని ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
 
 సంఘాల వారీగా కాదు.. జేఏసీతో చర్చలు
 పాక్షిక నివేదిక ఇచ్చి చర్చలకు రమ్మనడంలో అర్థం లేదని, పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాతే చర్చల్లో పాల్గొంటామని మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగ సంఘాల జేఏసీ తేల్చి చెప్పింది. సంఘాల వారీగా కాకుండా జేఏసీతో చర్చించాలని కోరారు. జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయింది. అంతకు ముందు జేఏసీ కార్యవర్గం సమావేశం నిర్వహించారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన యనమల.. నివేదికను ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని చెప్పారు. 12వ తేదీ వరకు తనతో పాటు ఉపసంఘంలోని మంత్రులు బిజీగా ఉంటారని, తరువాత రోజు చర్చలు జరపడానికి అభ్యంతరం లేదన్నారు.
 
 ఈ నేపథ్యంలో 13న చర్చలకు రావడానికి జేఏసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. జేఏసీ ప్రతినిధి బృందంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు(రెవెన్యూ సంఘం), కత్తి నరసింహారెడ్డి(ఎస్టీయూ), ఐ.వెంకటేశ్వరరావు(యూటీఎఫ్), చంద్రశేఖరరెడ్డి(ఏపీఎన్జీవో), రఘురామిరెడ్డి (ఏపీటీఎఫ్), కమలాకరరావు (పీఆర్టీయూ), రవికుమార్(ట్రెజరీ ఉద్యోగుల సంఘం), మురళీకృష్ణ తదితరులున్నారు.
 
 2013 జూలై నుంచి ఇవ్వాల్సిందే: అశోక్‌బాబు
 ఉద్యోగులకు 2013 జూలై నుంచి పీఆర్సీ అమలు చేసి ఆర్థిక లబ్ధి ఇవ్వాల్సిందేనని ఉపసంఘంతో భేటీ అనంతరం జేఏపీ చైర్మన్ అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ విషయంలో మరో మాటకు తావు లేదన్నారు. ఫిట్‌మెంట్ విషయంలో జేఏసీలో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన సంఖ్యను ప్రభుత్వానికి తెలియచేస్తామన్నారు. ఉద్యోగులు పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంటుందని ఉపసంఘం చెప్పిందని, దాన్ని పీఆర్సీ అమల్లో చూపించాలని కోరామన్నారు. ఉద్యోగులు ఇప్పటికే రెండున్న పీఆర్సీల కాలాన్ని ఆర్థిక లబ్ధి లేకుండా కోల్పోయారని యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఫిట్‌మెంట్ 60 శాతం, ఇంక్రిమెంట్ కనీసం 3.5 శాతం ఉండాలని చర్చల్లో పట్టుబడతామన్నారు.
 
 సాక్షి, హైదరాబాద్: తొమ్మిదో పీఆర్సీలో 27 శాతం ఫిట్‌మెంట్ అధారంగా వేతన సవరణ సంఘం కనీస వేతనాన్ని రూ. 6,700గా నిర్ణయించింది. అప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఫిట్‌మెంట్ 39 శాతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. కనీస వేతనాన్ని కూడా 39 శాతం ఫిట్‌మెంట్‌కు అనగుణంగా పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరగా సానుకూలంగా స్పందించింది. అందుకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ. 7,100గా నిర్ణయించి అమలు చేసింది. కాానీ పదో పీఆర్సీ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. పీఆర్సీ నివేదికలోని రూ. 6,700నే కనీస వేతనంగా తీసుకొని ఇప్పుడు రూ. 13 వేలను కనీస వేతనంగా నిర్ణయించింది. ప్రభుత్వం అమలు చేసిన రూ. 7,100ను ఆధారంగా తీసుకుంటే.. పీఆర్సీ లెక్కల ప్రకారమే కనీస వేతనం దాదాపు రూ. 14 వేలు అవుతుంది. కుటుంబానికి ముగ్గురు వ్యక్తుల చొప్పున పీఆర్సీ లెక్కలు గట్టిన విషయం విదితమే.
 
 మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల ఇళ్లలో ముగ్గురే ఉన్న కుటుంబాలు ఉన్నాయా? అని ఉద్యోగులు ప్రశ్నకు సమాధానం లేదు. కనీసం నలుగురు సభ్యులను కుటుంబంగా తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో కుటుంబం రోజుకు ఒక లీటరు పాలు కూడా వినియోగించదని పీఆర్సీ నివేదికలో పేర్కొంది. నెలకు 18 లీటర్లు కుటుంబానికి సరిపోతాయని లెక్కలు గట్టింది. పీఆర్సీ ప్రామాణికంగా తీసుకున్న ఐఎల్‌సీ(ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫెరెన్స్) గణాంకాల ప్రకారం.. పౌష్టికాహారం అందాలంటే నెలకు 75 లీటర్ల పాలు వినియోగించాలి. దాన్ని పీఆర్సీ పరిగణించకపోవడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement