ఉనికి కోల్పోతున్న ఐడీసీ! | State irrigation development organization losing existence | Sakshi
Sakshi News home page

ఉనికి కోల్పోతున్న ఐడీసీ!

Published Thu, Feb 6 2014 5:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఉనికి కోల్పోతోంది. 1976వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మెట్టభూములకు సాగునీటి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఐడీసీని స్థాపించారు.

 సత్తుపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఉనికి కోల్పోతోంది. 1976వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మెట్టభూములకు సాగునీటి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఐడీసీని స్థాపించారు. మొదట్లో బోర్‌వెల్స్ వేసి పంట భూములకు సాగునీరు అందించారు.

కాలక్రమేణ భూగర్భజలాలు అడుగంటుతున్నాయనే కారణంతో బోర్‌వెల్స్‌ను నిలిపివేశారు. కేవలం ఎత్తిపోతల పథకాల రూపకల్పన, నిర్వహణ చేపట్టారు.  1997లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐడీసీలో వీఆర్‌ఎస్  ప్రవేశపెట్టి బలవంతంగా ఉద్యోగులను పదవీ విరమణ చేయించారు. ఎవరైనా వ్యతిరేకిస్తే తప్పనిసరిగా తొలగిస్తామని  చెప్పటంతో చాలామంది ఉద్యోగులు ఇంటిబాట పట్టారు. మిగిలిన ఉద్యోగులకు జీతభత్యాలు కూడా నాలుగైదు నెలలకోసారి ఇచ్చారు.
 
 వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి కాగానే...
  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రాగానే అవసాన దశలో ఉన్న ఐడీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నించారు. వేతన బకాయిలు కూడా చెల్లించారు. ఎత్తిపోతల పథకాలకు ఉచిత విద్యుత్ అందించి.. కొత్త ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి జీవం పోశారు.

 ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు అందేలా చర్యలు తీసుకోవటంతో వైఎస్‌ఆర్ హయాం సువర్ణయుగంగా గడిచిందని రైతులు, ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్‌ఆర్ మరణానంతరం పైసా నిధులు విడుదల చేయకుండా కిర ణ్ సర్కార్ చంద్రబాబు బాటలో పయనిస్తూ ఐడీసీని నిర్వీర్యం చేస్తూ మూసివేసే దశకు తెచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

 అభివృద్ధికి  కేటాయించిన నిధుల్లోనే...
 జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం సబ్ డివిజన్‌లలో 32 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 375 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి కింద సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 2009 నుంచి జిల్లాకు నిధులు కేటాయింపులు నామమాత్రంగానే ఉంటున్నాయి. నోరు ఉన్నోడిదే రాజ్యం.. అన్న రీతిలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

అభివృద్ధికి కేటాయించిన నిధుల్లోనే 15శాతం సిబ్బంది జీతభత్యాలకు చెల్లిస్తున్నారు. కొత్త పథకాలకు ప్రతిపాదనలు పంపినా మోక్షం కలగటం లేదు. నిధులు విడుదల కాకపోవటంతో ఎత్తిపోతల పథకాలు, కార్యాలయాల నిర్వహణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. కేవలం విద్యుత్ బిల్లులు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది.

 భవిష్యత్తు ఏమిటి...?
 ఐడీసీలో ఉద్యోగ నియామకాలు నిలిపివేసి సుమారు 15 ఏళ్లు కావస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 385 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణలో 135 మంది, 250 మంది సీమాంధ్రలో ఉన్నారు. కొత్తగా ఏర్పడిన చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఐడీసీని ఎత్తేశారు. ఉద్యోగులకు వీఆర్‌ఎస్ వర్తింప చేసి ఇంటికి పంపించారు. 400మందికి పైగా ఉంటేనే కార్పోరేషన్ ఉంటుందని..  ప్రస్తుత పరిస్థితుల్లో ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉంటుందా.. మూసివేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

 2015కల్లా సుమారు 50శాతం పైగా ఉద్యోగులు పదవీవిరమణ చేసే అవకాశాలు ఉన్నాయని ఐడీసీ వర్గాలు తెలిపాయి. దీంతో మిగిలిన సిబ్బందితో ఎంత వరకు ఐడీసీ ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐడీసీ ఉద్యోగులను వేరేశాఖలకు పంపిస్తారో.. పాత వీఆర్‌ఎస్ పథకం అమలు చేస్తారో అర్థంకాక ఉద్యోగులు డోలాయమాన పరిస్థితిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement