సాలూరు... రవాణా రంగంలో విజయవాడ తరువాత అంతటి గుర్తింపు పొందిన పట్టణం. దీనిపైనే వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిశ్రమపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. డీజిల్ ధరాభారంతో ఈ రంగం కునారిల్లుతోంది. పెరుగుతున్న ఖర్చులు... గిట్టుబాటు కాని కిరాయి కారణంగా లారీ యజమానులు కాస్తా వేరే వ్యాపారాలవైపు మళ్లిపోతున్నారు. ఈ ప్రభావం వల్ల ఎన్నో కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న ప్రత్యేక పన్ను వల్లనే ఈ పరిస్థితి దాపురిస్తోందన్నది లారీ యజమానుల వాదన.
సాలూరు:జిల్లాలో లారీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కారణం డీజిల్ ధరలు. రాష్ట్రంలో ప్రత్యేక పన్ను విధించడంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎక్కువ ధరకుకొనాల్సి వస్తోంది. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో లీటర్ డీజిల్ ధర మన రాష్ట్రం కన్నా 2 రూపాయలు తక్కువ. తమిళనాడులో 4రూపాయలు, కర్ణాటకలో 7రూపాయలు తక్కువ. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలోనే డీజిల్ ధర అత్యధికంగా ఉంటోంది. దీనివల్ల ఒక్కో లారీపై నెలకు కనీసం రూ. 5వేల వరకూ అదనపు భారం పడుతోందని లారీ యజమానులు వాపోతున్నారు. అసలే కిరాయి అంతంత మాత్రంగా వుండటంవల్ల అవస్థలు పడుతున్నామని, ఇది చాలదన్నట్టు డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పన్ను విధించడంతో ప్రధానంగా లారీ యజమానులే నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
జిల్లా లారీ యజమానులపై రూ. కోటిన్నరభారం
రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యధిక సంఖ్యలో లారీలు దాదాపు 1200 వరకూ సాలూరు పట్టణంలోనే వున్నాయి. జిల్లా వ్యాప్తంగా చిన్నాపెద్దా లారీలు కలుపుకుని 3500వరకు వున్నా యి. వీటిలో అత్యధికంగా చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్– విశాఖపట్నం మార్గంలోనే సరుకుల రవాణా చేస్తుంటాయి. నెలకు 5 ట్రిప్పులు రవాణా చేస్తుండడంతో నెలకు ఒక్కో ట్రిప్పునకు కనీసం వెయ్యి రూపాయల చొప్పున నెలకు 5వేల రూపాయల అదనపు భారం పడుతోంది. కేవలం డీజిల్ ధర పెంపుకారణంగానే ఇలా పడుతోంది. విశాఖ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లి వచ్చేందుకు 1000కిలోమీటర్ల దూరా నికి 460 లీటర్ల డీజిల్ ఖర్చువుతోంది. అలా నెలకు 5ట్రిప్పులకు 5వేల రూపాయల వరకు భారం పడుతోందని లారీ యజమానులు చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లాలోని లారీ యజమానులపై నెలకు కోటిన్నర వరకు భారం పడుతోంది. ఆ భారం మోస్తున్నవారిలో అత్యధికంగా సాలూరు లారీ యజమానులే వుండటం గమనార్హం.
అమలుకాని సీఎం హామీ
నాలుగేళ్ల కిందట ఎన్నికల ప్రచారం నిమిత్తం సాలూరుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ లారీ పరిశ్రమ నిలదొక్కుకునేందుకు చేయాల్సిందల్లా చేస్తానని హామీ ఇచ్చారనీ, దానిని నెరవేర్చాలని లారీ యజమానులు కోరుతున్నారు. అధికారం చేపట్టి నాలుగేళ్లవున్నా చేసిందేమీ లేకపోవడంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు రంగంలో వున్న లారీలు నిలదొక్కుకోవాలంటే డీజిల్ ధరను తగ్గించడంతోపాటు కిరాయి రేట్లను పెంచాలని కోరుతున్నారు. డీజిల్ ధరను తగ్గించలేని పక్షంలో లారీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేక పన్ను కారణంగా అధిక భారం
డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పన్ను విధించడంతో ఇతర రాష్ట్రాలకన్నా ధర ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల లారీ నిర్వహణ భారం పెరిగిపోతోంది. చాలామంది లారీ యజమానులు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రభుత్వం లారీ పరిశ్రమ నిలదొక్కుకునేందుకు పన్ను మినహాయింపు ఇవ్వాలి.– గొర్లె మాధవరావు, ఏపీ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment