‘హోదా’ పరిశీలనలో ఉంది
- కేంద్రమంత్రి వెంకయ్య వెల్లడి
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ విభజన చట్టంలో కొన్ని సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. విభజన చట్టంలో ఎలాంటి సవరణ ప్రతిపాదనపైనైనా రెండు రాష్ట్రాలతోనూ, సంబంధిత ప్రజాప్రతినిధులతో మాట్లాడాకే ముందుకెళతామన్నారు. శాసనమండలిలో సభ్యుల సంఖ్య, ఉద్యోగుల వ్యవహారాలు, కొన్ని ఇతర అంశాలకు సంబంధించి తానిప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు.
ఆయా అంశాలపై కనీసం స్థూలంగానైనా ఏకాభిప్రాయం కుదిరితేనే కేంద్రం ఆ దిశలో ముందుకు సాగుతుందని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఏపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్లతో కలసి ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. దీనిలో కొన్ని చిక్కులు, సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించే ప్రయత్నాలపై అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు. ఇది అంత సులభమైందే అయితే వాళ్లే(కాంగ్రెస్ పార్టీ) ఇచ్చేసి ఉంటే సరిపోయేది కదా? అని అన్నారు. హామీలపై డిమాండ్ చేసే హక్కుకాంగ్రెస్‌కు లేదని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్ కేంద్రంలో చేరే ప్రతిపాదనేది లేదు..
కేంద్ర మంత్రివర్గంలోకి టీఆర్‌ఎస్ చేరే ప్రతిపాదనేదీ ఇప్పటికి లేదని వెంకయ్యనాయుడు చెప్పారు. అలాంటి చర్చ తనతోగానీ, ప్రధాని మోదీతోగానీ జరగలేదని ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయంలో ఏర్పడిన వివాదాన్ని తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులిద్దరూ కలసి మాట్లాడుకుని పరిష్కరించుకోవడం సంతోషకర పరిణామమన్నారు. ఏ సమస్యనైనా ఇద్దరూ సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు.