
ఉక్కు బ్లాస్ట్‌ఫర్నేస్‌లో పేలుడు
హాట్ మెటల్ నేలపాలు
విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ భ్లాస్ట్‌ఫర్నేస్-2లో శుక్రవారం మద్యాహ్నం పేలుడు సంభవించింది. ఫర్నేస్‌కు చెందిన ట్యూయర్లు బరెస్టు కావడంతో హాట్ మెటల్ నేలపాలయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. విభాగంలో యథావిధిగా ఉత్పత్తి కొనసాగిస్తుండగా ఏ షిప్ట్ చివరి సమయంలో ఒక్కసారిగా పేలుళ్ళు సంభవించాయి. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత చూసే సరికి ఫర్నేస్ ప్రాంతంలో మంటలు, పొగలు అలముకున్నాయి. తక్షణమే సమాచారం అందించటంతో హూటాహూటిన అగ్నిమాపక శకటం అక్కడకు చేరుకుని మంటలను ఆదుపు చేయటం ప్రారంభించారు. ఈ లోగా అక్కడ కొద్దిగా గ్యాస్ లీకవటంతో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని అక్కడ వున్న వారిని బయటకు పంపివేశారు. ఈ ప్రమాదంలో 7,8 ట్యాప్ హోల్ మద్య గల 5 ట్యూయర్‌లకు నష్టం వాటిల్లింది. వెంటనే పక్కన వున్న ట్యాప్ హోల్‌లో ట్యాపింగ్ పూర్తి చేసి పర్నేస్‌ను డౌన్ చేశారు. సీఎండి పి.మధుసూధన్, డెరైక్టర్ (ఆపరేషన్స్) డిఎన్.రావులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పునరుద్ధరణ పనులపై విభాగం అధికారులతో చర్చించారు.
హాట్‌మెటల్ నష్టంపై అంచనాలు
ట్యూయర్‌లు బరస్టు సంఘటనలో హాట్ మెటల్ నెలపాలుపై విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ట్యూయర్‌లో వున్న కోక్ ఎక్కువ బయటకు వచ్చినట్లు సంఘటన స్థలం నుంచి చూస్తే తెలుస్తుంది. ఈ ప్రమాదంపై ఉక్కు కార్మిక వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
సంఘటన స్థలంకు భారీగా చేరుకున్న కార్మిక వర్గం
స్టీల్‌ప్లాంట్ బీఎఫ్ విభాగం వద్ద ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న ఉక్కు కార్మిక వర్గం విభాగం వద్దకు భారీగా చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. విభాగంలో ఏం జరిగిందన్న విషయం తెలుసుకునేందుకు కార్మికులు లోపలకు వెళ్లెందుకు ప్రయత్నించగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. సంఘటన స్థలంను ఉక్కు కార్మిక సంఘ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, ఎన్.రామారావు, నీరుకొండ రామచంద్రరావులు సందర్శించారు.