
స్టీల్ ప్లాంట్‌భూములకు టెండర్!
విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు...
ఒకప్పుడిది తెలుగువారి నినాదం
ఉక్కు భూములు... మాకే దక్కు...
ఇదీ ప్రస్తుతం టీడీపీ పెద్దల పన్నాగం
విశాఖ స్టీల్‌ప్లాంట్ భూములపై అధికార పార్టీ పెద్దల కన్ను పడింది. భవిష్యత్ అవసరాల కోసం ప్లాంట్ ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న రూ.3వేల కోట్ల విలువైన భూములను దక్కించుకునేందుకు వారు వ్యూహం పన్నారు.
విశాఖపట్నం: గత... ప్రస్తుత ప్రభుత్వాల్లో చక్రం తిప్పుతున్న ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉక్కు భూముల కోసం రంగంలోకి దిగారు. గతంలో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం వీరి ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకించినా.. ప్రస్తుత యాజమాన్యం ఒత్తిడికి తలొగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఆదాయ సముపార్జన పేరిట ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని నియమించడం గమనార్హం. విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం 21వేల ఎకరాలు సేకరించగా సుమారు 11వేల ఎకరాల్లో ప్లాంట్, టౌన్‌షిప్ నిర్మించారు. ఇంకా 10వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. విశాఖ నగర పరిధిలోని స్టీల్‌ప్లాంట్ ఏరియా, ఆటోనగర్, పెద్దగంట్యాడ, హెచ్.బి.కాలనీలతోపాటు విశాఖ జిల్లాలోని అనకాపల్లి, కోటపాడు మండలాల్లో ప్లాంట్‌కు భూములు ఉన్నాయి. నగర పరిధిలో ఎకరా సగటున రూ.5 కోట్ల వరకు మార్కెట్ ధర పలుకుతోంది. అనకాపల్లి ప్రాంతంలో ఎకరా రూ.2 కోట్లు, కోటపాడు ప్రాంతంలో ఎకరా రూ.75 లక్షల వరకు ఉంది. ఆ భూముల కోసం గత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో వీరు చేసిన ప్రయత్నాలను అప్పటి స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే బిష్ణోయ్ తీవ్రంగా ప్రతిఘటించడంతో వారి పన్నాగం ఫలించలేదు.
4 సంస్థలు.. 600 ఎకరాలు
ప్రస్తుతం కూడా అధికార పార్టీలో ఉన్న ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు మళ్లీ ఉక్కు భూములపై పడ్డారు. ప్రభుత్వంలో ఉన్న నగరానికి చెందిన కీలక నేత ఒకరు ప్లాంట్ ముఖద్వారానికి కుడివైపు ఉన్న 50 ఎకరాలు తమ కుటుంబ షిప్పింగ్ కంపెనీకి కావాలని అడుగుతున్నారు. మరో ప్రజాప్రతినిధి తమ ఇంజినీరింగ్ కాలేజీ కోసం 50 ఎకరాలు కావాలని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ ముఖ్య నేత సన్నిహితుల సంస్థ తాము నెలకొల్పనున్న స్పోర్ట్స్ అకాడమీ కోసం 100 ఎకరాలు అడుగుతోంది. ఆ సంస్థకు కోటపాడు మండలంలో భూమి ఇచ్చేందుకు ఉక్కు అధికారులు సమ్మతించారు. అయితే మారుమూల మండలంలో కాకుండా ప్లాంట్ ఏరియాలోనే ఇవ్వాలని ఆ సంస్థ పట్టుబడుతోంది. అలాగే ఓ బడా కార్పొరేట్ సంస్థ తమ విద్యుత్తు ప్లాంట్ విస్తరణ కోసం ఏకంగా 400 ఎకరాలు ఇవ్వాలంటోంది. ఈ రెండు సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వ ముఖ్య నేతే సిఫారసు చేస్తున్నారు. మొత్తం మీద రూ.3వేల కోట్లు విలువైన 600 ఎకరాల కోసం ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. తమ మాట వినకుంటే స్టీల్‌ప్లాంట్ అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
భూములపై నిర్ణయానికి కమిటీ
ప్రజాప్రతినిధుల ఒత్తిడికి స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం లొంగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఖాళీగా ఉన్న భూముల అప్పగింతపై సిఫారసు చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. పి.శ్రీవాస్తవ(జీఎం-టౌన్ అడ్మిన్) చైర్మన్‌గా కె.వేణు (డీజీఎం-మెకానికల్), ఎన్.శ్రీనివాసరావు ( ఏజీఎం-ఎఫ్‌అండ్‌ఏ) సభ్యులుగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఖాళీగా ఉన్న భూముల సద్వినియోగం, ఆదాయ సముపార్జన తదితర అంశాలపై సిఫారసులు చేస్తుంది. కమిటీ నియామకం, మూడు వారాల్లో నివేదిక సమర్పించమని గడువు విధించడం సందేహాస్పదంగా మారింది.