ముట్టడిలోనే ముద్రగడ
- గడువు ముగిసినా కొనసాగుతున్న నిర్బంధం
- పోలీసులు వెళ్లాక పాదయాత్ర తేదీలు ప్రకటిస్తా
- యాత్ర చేసితీరతామంటున్న కాపు ఉద్యమనేత
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహనిర్భంధం మూడో రోజు గురువారం కూడా కొనసాగుతోంది. పోలీసులు ఇచ్చిన 48 గంటలు గడువు గురువారం రాత్రితో ముగిసింది. గడువు ముగిసినా నిర్బంధంలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. అరుుతే కాస్త సడలింపు ఇవ్వడంతో మూడోరోజు ముద్రగడను స్థానికులు కలిశారు. గడువు ముగియడంతో గృహనిర్బంధాన్ని ఉపసంహరించుకుంటారా లేదా అనే విషయంపై పోలీసుల నుంచి స్పష్టత రావడం లేదు. ముద్రగడ సహా కాపు నేతలను మూడో రోజు కూడా గృహ నిర్బంధంలోనే ఉంచడంతో కాపు యువత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది.
రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్రకు సిద్ధమవగా ముద్రగడ సహా పలువురు కాపు జేఏసీ నేతలను మంగళవారం ప్రభుత్వం నిర్బంధించిన సంగతి తెలిసిందే. అరుుతే మూడో రోజు సాయంత్రం నుంచి కాస్త సడలింపు ఇచ్చారు. బుధవారం ముద్రగడను కలిసేందుకు వచ్చిన బంధువులను సైతం ఇంట్లోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్న పోలీసులు గురువారం మీడియాతోపాటు స్థానికులను కూడా అనుమతించారు. కాగా కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల గృహ నిర్బంధాలు గురువారం కూడా కొనసాగారుు.
పోలీసులు వెళ్లిపోతేనే తేదీలు ప్రకటిస్తా..
ఫలానా తేదీ నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని ముద్రగడ గానీ మరెవరైనా చెబితే పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ముద్రగడ మాత్రం ముందుగా పోలీసులు తప్పుకుని స్వేచ్ఛ ఇచ్చాక పాదయాత్ర చేసి తీరతానంటున్నారు. పాద యాత్ర చేయడం మాత్రం ఖాయమంటున్నారు. అందుకు పోలీసుల అనుమతి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఇదే విషయాన్ని గురువారం రాత్రి తనను కలిసిన మీడియా వద్ద మరోసారి స్పష్టం చేశారు. ఎన్నిరోజులు ఇంట్లో ఉండమంటే అన్ని రోజులూ ఉంటానని, పోలీసులు వెళ్లిపోయి తనకు స్వేచ్ఛ ఇస్తే పాదయాత్ర చేపడతాను, పోలీసులు వెనక్కు వెళ్లిపోతే పాదయాత్ర తేదీలు ప్రకటిస్తానని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు.