ఉద్యమమే ఊపిరిగా..
Published Wed, Oct 30 2013 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం జోరుగా సాగుతోంది. మంగళవారం నాగాయలంకలో జేఏసీ- లయన్స్‌క్లబ్ నాయకులు కృష్ణానది వరదనీటిలో జలదీక్ష చేశారు. గన్నవరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఉద్యమించారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకుల పిలుపు మేరకు నియోజకవర్గంలోని పలు పీహెచ్‌సీల నుంచి తరలివచ్చిన వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 81వ రోజుకు చేరాయి.
వాసవీ మహిళా మండలి నాయకులు దీక్షలో పాల్గొన్నారు. అవనిగడ్డలో నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు దీక్షలు చేశారు. కలిదిండి మండలం ఆరుతెగలపాడు జెడ్పీ పాఠశాల విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్ధతుగా గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వివేకానంద కాన్వెంట్ విద్యార్థులు సెంటరులో మానవహారం నిర్వహించి, సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుడివాడ నెహ్రూచౌక్‌లో జరుగుతున్న రిలేనిరాహారదీక్షలు 84వ రోజుకు చేరుకున్నాయి. చిన్న పరిశ్రమల సంఘ రాష్ట్ర కార్యదర్శి అల్లం రామ్మోహనరావు శిబిరాన్ని ప్రారంభించారు. కాకర్లవీధి యూత్ సభ్యులు పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో జేఏసీ ప్రతినిధులు స్థానిక విజ్ఞాన్ విద్యాసంస్థల విద్యార్థులతో కలసి మున్సిపల్ కూడలిలో ధర్నా, మానవహారం నిర్వహించారు. నందివాడ మండలం టెలిఫోన్‌నగర్ కాలనీలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 59వ రోజుకు చేరాయి. కైకలూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో విద్యార్థులు మానవహారం చేపట్టారు. వైఎస్ జగన్ మాస్క్‌లను ధరించి నినాదాలు చేశారు.
నూజివీడు చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 83వ రోజుకు చేరుకున్నాయి. రైతులు, జేఏసీ నాయకులు, విద్యార్థులు కలసి చిన్నగాంధీబొమ్మ సెంటరులో గంట సేపు ధర్నా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 63వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నాయకుడు పల్లెర్లమూడి అభినేష్ ప్రారంభించారు. బంటుమిల్లిలో జేఏసీ నాయకులు 216 జాతీయ రహదారిని ఊడ్చి నిరసన తెలిపారు.
ఆగిరిపల్లిలో మండల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 34వ రోజుకు చేరాయి. చాట్రాయి మండలం తెలంగాణ సరిహద్దు గ్రామమైన కృష్ణారావుపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తిరువూరు బోసుసెంటర్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. 28వ రోజు దీక్షలో నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్, మండల పార్టీ కన్వీనర్ శీలం నాగ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉయ్యూరులో జరిగిన 86వ రోజు దీక్షలో సీనియర్ సిటిజన్లు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడలో వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.
Advertisement
Advertisement