బెజవాడలో లగడపాటిపై దాడికి యత్నం
విజయవాడ : విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు మరోసారి సమైక్య సెగ తగిలింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గత 33 రోజులుగా బెజవాడ ఆటోనగర్లో ఆటోమొబైల్ టెక్నికల్ సిబ్బంది చేస్తున్న సమైక్య దీక్ష శిబిరాన్ని సందర్శించిన సమయంలో ఉద్యమకారులు ఎంపీని నిలదీశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ సందర్భంగా కార్మికులను అడ్డుకోవటంతో తోపులాట జరిగింది. దాంతో ఆగ్రహించిన కార్మికులు లగడపాటిపైకి దూసుకు పోయేందుకు యత్నించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దాంతో లగడపాటిని అక్కడ నుంచి వెళ్లిపోవల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినా లగడపాటి అక్కడ నుంచి కదలలేదు. అయినా ఆయన మాట్లాడేందుకు అవకాశం రాకపోవటంతో గంటపాటు కూర్చుని పోలీసుల సాయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు.