బెజవాడ సీటుపై చిన్నమ్మ కన్ను!!
ఒకవైపు ఇల్లు కాలుతుంటే, మరోవైపు చుట్ట అంటించుకోడానికి నిప్పు దొరికిందని సంబరపడ్డాడట వెనకటికొడు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఢిల్లీ సింహాసనాన్ని సైతం దడదడలాడించి, 'మదరాసీలు' అనే పేరు నుంచి తెలుగువాళ్లు అనే ఒక పేరున్న విషయాన్ని ఉత్తరాదివారికి అర్థమయ్యేలా చేసిన మహానుభావుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలపై ఆయన తన జీవితాంతం పోరాడారు. అలాంటి ఎన్టీఆర్ కుమార్తె అయి ఉండి.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి, గెలిచి, కేంద్రంలో మంత్రిపదవి చేపట్టిన పురందేశ్వరి (చిన్నమ్మ) ఇప్పుడు విభజనతో రాజకీయ ప్రయోజనాలు వెతుక్కుంటున్నారు. మిగిలిన నాయకులందరి కంటే ఈ విషయంలో ఆమె రెండాకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తున్నారు. సీమాంధ్రలో సామాన్య ప్రజలందరూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఉధృతంగా ఉద్యమిస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎన్నికలు, సీట్లు, ఓట్ల గురించే ఆలోచిస్తున్నారు.
చిన్నమ్మ ఈ విషయంలో అందరి కంటే ముందున్నట్లు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేయాలని ఆమె తీవ్రంగా ప్రణాళికా రచనలో మునిగి తేలుతున్నారు. విశాఖపట్నం స్థానం తనదేనంటూ సుబ్బిరామిరెడ్డి ఎప్పటినుంచో గట్టిగా చెబుతుండటంతో చిన్నమ్మ కన్ను విజయవాడపై పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లగడపాటి రాజగోపాల్ అటు అధిష్ఠానంతో సఖ్యత కోల్పోయి, ఇటు జనం మధ్యలోకి రాలేక రెంటికీ చెడ్డ రేవడిలా మారారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయవాడలో పాగా వేయాలని పురందేశ్వరి వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం.
వచ్చే ఎన్నికల్లో విజయవాడ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ లగడపాటికి ఇవ్వబోరని, తనకు తన సామాజికవర్గం అండదండలు లభిస్తాయనే గంపెడాశతో ఉన్న చిన్నమ్మ.. ఆ దిశగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే విజయవాడలో ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన దగ్గుబాటి దంపతులు సొంత సామాజికవర్గ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సమైక్యత కంటే సీమాంధ్ర అభివృద్ధికి కృషి చేయడం మంచిదని, బెజవాడను రాజధాని చేసుకుంటే గుంటూరు, తెనాలి వరకు అభివృద్ధి జరుగుతుందని పురందేశ్వరి సూచించినట్లు సమాచారం.
పురందేశ్వరి దృష్టి విజయవాడపై పడడానికి మరో కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపై టి.సుబ్బిరామిరెడ్డి పట్టుబడుతుండడంతో పాటు అక్కడ ప్రతికూల పవనాలు వీస్తుండడంతో బెజవాడ నుంచి పోటీ చేయాలని పురందేశ్వరి భావిస్తున్నట్లు సమాచారం. ఐతే... ఉద్యమం కంటే రాజకీయ భవిష్యత్తుకే నేతలు పెద్దపీట వేస్తుండడంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. మరోవైపు లగడపాటి వర్గీయులు కూడా అప్రమత్తమయ్యారు. చిన్నమ్మకు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు.